యశవంతపుర: ఓ కిలాడీ మహిళ మాయమాటలతో నమ్మించి రూ. 6 కోట్లు వసూలుచేసిన ఘటన బెంగళూరు విజయనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. నిందితురాలు ఐశ్వర్యగౌడ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. విజయనగరలో డాక్టర్ గిరీశ్, భార్య డాక్టర్ మంజుళ ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. 2022లో ఐశ్వర్యగౌడ అనే మహిళ కాస్మెటిక్ సర్జరీ కోసం వీరి ఆస్పత్రికి వచ్చింది. వైద్య దంపతుల వద్ద బాగా డబ్బులున్నట్లు తెలుసుకున్న ఐశ్వర్య మోసానికి ప్లాన్ వేసింది. తను రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యవహారం చేస్తుంటా, విలువైన సెకండ్ హ్యాండ్ కార్ల క్రయ విక్రయాలు సాగిస్తుంటానని వైద్య జంటకు నమ్మించింది.
గిరీశ్ తనకొక ఖరీదైన కారు కావాలని ఐశ్వర్యకు చెప్పాడు. సరేనని ఆమె గిరీశ్ నుంచి రూ.2.75 కోట్లను ఆర్‌టీజీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో తీసుకుంది. తరువాత మరో రూ.3.25 కోట్లను ఐశ్వర్య వసూలు చేసింది. కానీ ఎలాంటి కారును వారికి ఇవ్వలేదు. ఓ రోజు వైద్య దంపతులు ఒక క్లబ్‌లో ఐశ్వర్యగౌడ ఉండగా వెళ్లి తమ డబ్బులను వాపస్ ఇవ్వాలని కోరగా, ఆమె నోటికొచ్చినట్లు తిట్టి, ఏమైనా చేసుకోండి, పైసా కూడా ఇవ్వను, రేప్ చేశావని నీపై కేసు పెడతానని గిరీశ్‌ను బెదిరించింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి రూ. 5 లక్షలు ఇవ్వాలని బెదిరించి, రూ.2 లక్షలను లాగేసుకుంది. ఐశ్వర్య ప్రవర్తనతో విసిగిపోయిన గిరీశ్ దంపతులు ఇప్పుడు విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిలాడీలేడీపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.
అయ్యో అయ్యప్ప.. రూ.96 లక్షలు టోకరా
బనశంకరి: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి అని సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన నమ్మి ఓ వ్యక్తి రూ.96.20 లక్షలు పెట్టుబడి పెట్టి గొల్లుమన్నాడు. ఈ ఘటన బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు.. కొత్తనూరు బాలాజీలేఔట్ నివాసి ఏయు.అయ్యప్ప (38) బాధితుడు. ప్రైవేటు కంపెనీ ఉద్యోగి అయిన అయ్యప్ప ఫేస్‌బుక్‌లో ఇన్వెస్ట్ స్టాక్ మార్కెట్ అనే ప్రకటనను చూశాడు. అందులోని మొబైల్ నంబరుకు కాల్ చేయగా వారు అతన్ని తమ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు.
తాము చెప్పినట్లు షేర్స్‌లో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. దుండగులు అయ్యప్ప మొబైల్‌కు సీహెచ్‌సీ ఎస్‌ఈస్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. తరువాత అయ్యప్ప బ్యాంకు అకౌంట్, ఆధార్‌కార్డు, పాన్‌కార్డుతో పాటు ఇతర సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయించారు. వంచకుల సూచన మేరకు వివిధ బ్యాంకు అకౌంట్లలోకి దశలవారీగా రూ.96.20 లక్షలను జమ చేశాడు. రూపాయి కూడా లాభం రాలేదు, దీనిపై అయ్యప్ప ప్రశ్నించగా మోసగాళ్లు స్పందించలేదు. మునిగిపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
వైద్య దంపతులకు నిండా మోసం
బెంగళూరులో బడా చీటర్
Comments
Please login to add a commentAdd a comment