దొడ్డబళ్లాపురం: కన్నడ ప్రముఖ హీరో శివ రాజ్‌కుమార్‌కు ఆరోగ్యం బాలేదని, తరచూ సుస్తీగా ఉంటోందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటి వరకూ శివు నోరు విప్పలేదు. అయితే తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో స్పందించారు. నిజంగానే తనకు ఆరోగ్యం బాలేదని, ఒక సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. తాను కూడా మనిషే అని అన్నారు. అభిమానుల వద్ద ఇలాంటి విషయాలు దాచే ఉద్దేశం తనకు లేదన్నారు. నెల రోజుల్లో ఆపరేషన్ చేయించుకోవాలని, అయితే అది మనదేశంలోన, అమెరికాలోనా అనేది నిర్ణయించుకోలేదన్నారు. కాగా, ఏం ఆపరేషన్ అనేది శివు వెల్లడించలేదు. ఆయన కుటుంబానికి గుండె జబ్బుల సమస్య ఉంది. గతంలో సోదరుడు పునీత్ ఆకస్మికంగా గుండెపోటుతో అస్తమించడం తెలిసిందే.
బెంగళూరులో ఐటీ దాడులు
బనశంకరి: ఆదాయపు పన్ను ఎగవేతలకు సంబంధించి ఐటీ అధికారులు గురువారం బెంగళూరు నగరంలో పలుచోట్ల దాడులు నిర్వహించారు. భారీ మొత్తంలో పన్ను మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో ఢిల్లీ, ముంబైకి కంపెనీలలో సోదాలు చేపట్టారు. ఆఫీసులు, యజమానుల ఇళ్లలో ముఖ్యమైన ఫైళ్లు, కంప్యూటర్లు తదితరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
సీఎంకు త్వరలో ఈడీ సమన్లు?
శివాజీనగర: మైసూరులో ముడా ఇళ్ల స్థలాల కేసులో బుధవారమే లోకాయుక్త విచారణకు హాజరైన సీఎం సిద్దరామయ్యకు అంతలోనే కేంద్ర ఈడీ నుంచి ఎప్పుడైనా కబురు రావచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. సిద్దరామయ్య సన్నిహితులైన 7 మందికి ఇప్పటికే ఈడీ సమన్స్ జారీ చేసింది. ముడా మాజీ అధ్యక్షుడు మరిగౌడ, ముడా మాజీ కమిషనర్లు దినేశ్, నటేశ్‌తో పాటు మొత్తం 7 మంది విచారణకు హాజరుకావాలని బెంగళూరులోని ఈడీ ఆఫీసు ఆదేశాలిచ్చింది. ముడా కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తుండడం తెలిసిందే. ఇటీవలే ముడా ఆఫీసు, పలువురు బిల్డర్ల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. దీంతో సీఎంకు త్వరలోనే తాఖీదులు వస్తాయని అంచనాలున్నాయి.
దూడను కాపాడాలని.. ఇద్దరు జలసమాధి
శివాజీనగర: చెరువులో పడిన కోడె దూడను కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీటిపాలైన ఘటన హావేరి జిల్లా హానగల్ తాలూకా మకరవళ్ళి గ్రామంలో జరిగింది. నాగరాజ్ మట్టిమని (45), మాలతేశ్ దాసనూరు (48) చెరువులో గల్లంతైనవారు. ఊరిబయట ఉన్న చెరువులోకి కోడదూడ పడింది. అది మునిగిపోవడం చూసి కాపాడాలని ఇద్దరూ చెరువులోకి వెళ్లారు. అయితే చెరువులో ఉన్న తీగలు వారి కాళ్లకు చిక్కుకోవడంతో అక్కడే నీట మునిగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది, అడూరు పోలీసులు చెరువులో వారిద్దరి కోసం గాలింపు చేపట్టారు. బంధువుల రోదనలు మిన్నంటాయి.
పీయూసీ విద్యార్థిని ఆత్మహత్య
మైసూరు: అనారోగ్యంతో విసిగిపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని అశోకపురంలో జరిగింది. తనుశ్రీ (16) అనే బాలిక శారదా విలాస కాలేజీలో పీయూసీ చదువుతోంది. దొడ్డకాన్య గ్రామానికి చెందిన ఆమె కుటుంబం అశోకపురంలో నివసిస్తోంది. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేదు. దీంతో కుంగిపోయిన బాలిక ఇంటిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అశోకపురం పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment