సువర్ణసౌధ మార్మోగేలా..
సాక్షి, బెంగళూరు: అధికార, ప్రతిపక్షాల మధ్య వాక్ సమరం బెళగావిలోని సువర్ణ విధానసౌధలో ప్రతిధ్వనించబోతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి 20 వరకు మొత్తం 10 రోజులు జరగబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సౌధ ముస్తాబవుతోంది. పలు ముఖ్య పరిణామాల తరువాత జరగబోయే సమావేశాలు కావడంతో అంతటా కుతూహలం నెలకొంది. మూడు అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో గెలుపు ఆనందంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంటే, అంతర్గత విబేధాలతో బీజేపీ, తరచూ పరాజయాలతో మరో ప్రతిపక్షం జేడీఎస్ నిరుత్సాహంతో ఉన్నాయనే చెప్పాలి.
సమస్యల సుడిలో సీఎం..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై నమోదైన ముడా ఇళ్ల స్థలాల కేసులు, ఈడీ, ఐటీ దాడులతో ఆయనకు ఇబ్బందికర వాతావరణం ఉండింది. అలాగే వాల్మీకి మండలిలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణం, రైతులు, దేవస్థానాల భూములపై వక్ఫ్ చట్టం ప్రయోగంతో ఆయా వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఇవే కాక జిల్లాల్లో స్థానిక సమస్యలు అనేకం ఉన్నాయి. ఇవి కాంగ్రెస్ సర్కారు దూకుడుకు బ్రేకులు వేసేవే. ఇవన్నీ
బెళగావి సమావేశాల్లో ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఉప సమరంలో విజయం ఊరటనిచ్చింది. ఉత్తర కర్ణాటకలో అభివృద్ధి కొరత, వరదలు, కరువు పరిహారం అంశాలను కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది. తాజాగా బళ్లారి ఆస్పత్రిలో గర్భిణుల మరణాలు, మంత్రి ఆర్‌వీ తిమ్మాపురపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టనున్నాయి.
జేడీఎస్‌లో నిరుత్సాహం
మరోవైపు జేడీఎస్‌లో దళపతి మనవడు నిఖిల్ కుమారస్వామి ఈసారైనా గెలిచి అసెంబ్లీకి రావాలని ఉబలాటపడినా ఓటమే ఎదురైంది. సీనియర్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ అధినాయకత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. హెచ్‌డీ రేవణ్ణ కేసుల్లో ఇరుక్కోవడంతో దూకుడు తగ్గింది. ప్రభుత్వంపై పోరాడాలని జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి పిలుపునిచ్చారు. అయితే పార్టీ నేతల్లో అంతటి ఉత్సాహం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైంది.
బెళగావిలోని సువర్ణసౌధ
రేపటి నుంచి బెళగావిలో
అసెంబ్లీ సమావేశాలు
వాడీవేడిగా శీతాకాల చర్చలు!
మూడు పార్టీలకూ సొంత ఇబ్బందులు
బీజేపీకి యత్నాళ్ బెడద
ఉప ఎన్నికల తర్వాత బీజేపీలో రెబెల్‌నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వేరు కుంపటి పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్రకు కంట్లో నలుసుగా మారింది. ఈ గొడవలకు ఇంకా ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఇది తమకు లాభిస్తుందని కాంగ్రెస్ నాయకులు లోలోన సంతోషంగా ఉన్నారు. యత్నాళ్ అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారు అనేది ముఖ్యమైన విషయం కానుంది.
కోవిడ్ అక్రమాలపై ఉప కమిటీ చర్చ
బొమ్మనహళ్ళి: గతంలో బీజేపీ సర్కారు అవధిలో కోవిడ్ వైద్య పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని మైకేల్ జాన్ డి.కున్హా కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై మంత్రిమండలి ఉప సమితి సభ్యులు డీసీఎం డి.కే.శివకుమార్, మంత్రులు జీ. పరమేశ్వర్, దినేష్ గుండూరావు, శరణ ప్రకాశ్ పాటిల్ శనివారం విధాసౌధలో సమావేశమయ్యారు. కమిటీ సిఫార్సుల అమలు గురించి చర్చించారు. సిఫార్సులపై విచారణ, బాధ్యుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రస్తావించారు. ఈ కుంభకోణం ఎవరెవరి పాత్ర ఉంది, నగదు మంజూరు చేసింది ఎవరు తదితరాలను ఆరా తీశారు. అప్పటి సీఎం యడియూరప్ప, ఆరోగ్య మంత్రి బీ.శ్రీరాములుపై కేసులు పెట్టాలనేది చర్యకు వచ్చింది. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల ముందు ఈ అంశాన్ని లేవనెత్తడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment