ఘనంగా జీర్ణోద్ధరణ పూజలు
బొమ్మనహళ్లి: నగరంలోని బీటీఎం లేఔట్ కోరమంగళ కేఎస్‌ఆర్‌పి క్వార్టర్స్‌లో శ్రీమహాగణపతి, మునేశ్వర స్వామివారి దేవాలయం జీర్ణోద్ధరణ, మహా కుంభాభిషేకం వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం తెల్లవారుజాము నుంచే పూజలు, హోమాలు, నిర్వహించారు. కేపీసీసీ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనాలు చేసుకున్నారు.
కారుపై కూలిన కొమ్మ ●
● కుటుంబం క్షేమం
బనశంకరి: చెట్టు కొమ్మ కారుపై పడి కారు ధ్వంసమైంది. అందులో వెళుతున్న నలుగురు వ్యక్తులు తృటిలో బయటపడ్డారు. ఈ ఘటన బెంగళూరులో మైసూరు బ్యాంక్ సర్కిల్ వద్ద గల ప్యాలెస్ రోడ్డు అండర్‌పాస్ వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 11.20 సమయంలో ప్యాలెస్ రోడ్డు అండర్‌పాస్‌లో కారు వెళ్తుండగా చెట్టుకొమ్మ విరిగిపడింది. కారు ధ్వంసం కాగా డ్రైవరు కార్తీక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఓ కుటుంబం పసికందుతో కలిసి ఆర్‌టీ నగర వైపు వెళుతున్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు. కారు, చెట్టు కొమ్మ రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ రెండు గంటలకు పైగా పూర్తిగా నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు, పాలికె సిబ్బంది చేరుకుని వాటిని తొలగించారు.
గొడవలు వద్దు..
సర్దుకుపోండి
● బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ హితబోధ
బొమ్మనహళ్లి : దేశంలోనే అతి ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన పార్టీలో చిన్న చిన్న సమస్యలు సహజమని, వాటిపై గొడవలకు దిగి పార్టీ ప్రతిష్టకు మచ్చతేవద్దని పార్టీ శ్రేణులకు రాష్ట్ర ఇన్‌చార్జ్ రాధామోహన్ దాస్ అగర్వాల్ హితబోధ చేశారు. పార్టీలో ఎమ్మెల్యే యత్నాళ్ అసమ్మతి నేపథ్యంలో శనివారం బెంగళూరులో బీజేపీ ఆఫీసులో కోర్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర,, మాజీ సీఎం యడియూరప్ప, డి.వి.సదానందగౌడ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి, ఆర్.అశోక్, సీనియర్లు పాల్గొన్నారు. అగర్వాల్ మాట్లాడుతూ ఒకరో ఇద్దరో అసమ్మతి గళం వినిపించినంత మాత్రాన పార్టీ రాష్ట్ర అధ్యక్షుని మార్పు ఉంటుందనుకోవడం తగదన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు యువకుడని, కష్టపడి పనిచేస్తున్నారన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న యల్లాపుర ఎమ్మెల్యే శివరామ్ హెబ్బార్, యశ్వంతపుర ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్‌ను సస్పెండ్ చేయాలా లేదా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర బీజేపీలో ఎలాంటి వర్గ రాజకీయాలు లేవని, ఐక్యతతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని అగర్వాల్ మీడియాకు తెలిపారు. యత్నాళ్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చి సంజాయిషీ కోరినట్లు తెలిపారు.
ప్రియురాలి ఇంటి
ముందే ఆత్మహత్య
తుమకూరు: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని కోరగా, ఆమె కుటుంబ సభ్యులు తిరస్కరించడంతో ఓ భగ్న ప్రేమికుడు జీవితం మీద విరక్తి చెందాడు. యువతి ఇంటి ముందే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరం తుమకూరు నగరానికి సమీపంలోని చెన్నప్పనపాళ్యలో జరిగింది.
వివరాలు.. మంజునాథ్ (32), టెంపో ట్రాక్స్ డ్రైవర్‌గా పనిచసేవాడు. కొన్ని నెలలుగా పక్కింటి యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. యువతి కుటుంబ సభ్యులను మంజునాథ్ అడగగా, తమ కుమార్తె ఇంకా మైనర్ అని, ఇప్పుడే పెళ్లి చేయాలనుకోవడం లేదని స్పష్టంచేశారు. దీంతో తీవ్రంగా బాధపడిన మంజునాథ్ శుక్రవారం అర్ధరాత్రి యువతి ఇంటి ముందు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం స్థానికుల సమాచారం మేరకు జయనగర పోలీసులు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లాస్పత్రి మార్చురీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment