ఖైదీలు మస్తు మజా
దొడ్డబళ్లాపురం: కలబుర్గిలోని సెంట్రల్ జైలు గత కొన్ని రోజులుగా వివాదాలకు కేంద్రంగా మారింది. జైలర్ అనిత వర్సెస్ ఖైదీల మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో తాజాగా ఖైదీలు ఒకచోట చేరి పేకాట ఆడుతూ మద్యం తాగుతున్న వీడియో వైరల్‌గా మారింది. జైలర్ అనిత అక్టోబర్ 14న బదిలీపై వచ్చారు. ఆ నెల 16న ఈ వీడియో తీసినట్టు తెలుస్తోంది. తేదీ తెలిసేలా వీడియో తీసిన ఖైదీ ఆ రోజు దినపత్రిక కూడా వీడియో తీశాడు. అంతేకాకుండా జైలర్‌కు లంచం ఎంత ఇవ్వాలి, ఎలా మాట వినేలా చేసుకోవాలి అనేది కూడా ఖైదీలు మాట్లాడుకున్నారు. స్మార్ట్ ఫోన్లు పదుల సంఖ్యలో ఒకచోట పేర్చి, బీడీలు, సిగరెట్ల పెట్టెలు కూడా ఉన్నట్లు ఆ వీడియోలో దర్శనమిస్తున్నాయి. చివరకు అది జైలు గదిలా కాకుండా క్లబ్బు మాదిరిగా తయారైందని ఆరోపణలు వచ్చాయి.
ఎవరిది నిర్లక్ష్యం?
ఈ కారాగారంలో ఉన్న ఉగ్రవాది జుల్ఫికర్, శివమొగ్గ రౌడీషీటర్ బచ్చన్‌తో కలిపి మొత్తం ఆరుమంది పేరుమోసిన నేరస్తులను మరో చెరసాలకు తరలించారు. వారు మిగతా ఖైదీలతో కలిసి ముఠాలు నడుపుతూ సమస్యాత్మకంగా తయారు కావడంతో అధికారులు ఇలా చేశారు. ఇంతలో కొందరు ఖైదీలు జైలర్ అనిత లంచగొండి అని ఆరోపణలు చేశారు. జైలర్ అనిత విధుల్లో చేరిన రోజే ఖైదీలకు బయటి నుంచి బీడీలు, సిగరెట్లు, గుట్కా, మొబైళ్లు వంటివి రాకుండా అడ్డుకున్నారు. కాగా, వీడియోలో ఉన్న ఖైదీలు, అలాగే నిర్లక్ష్యంగా ఉన్న జైలు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
కలబుర్గి కారాగారంలో కలకలం
మొబైళ్లు, మద్యం, పొగాకు
సేవనం వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment