గుట్టలా పెరుగుతున్న చెత్తకు ఇక విముక్తి
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ జంట నగరాల్లో సేకరణ అయ్యే సుమారు 4.8 లక్షల టన్నుల చెత్తను బయోమైనింగ్ ద్వారా సంస్కరించే ప్రక్రియకు కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. వివరాలు.. జంట నగరాల్లో పెరుగుతున్న వ్యర్థాలతో నిత్యం చెత్త దిబ్బలు పెరిగి పోతున్నాయి. గత 50 ఏళ్ల నుంచి సేకరించి నిలువ చేస్తున్న చెత్త దిబ్బలు పర్వతాల్లా పేరుకుపోయాయి. స్థానిక కార్వార రోడ్డులో 19 ఎకరాల ప్రాంతంలో, అలాగే ధార్వాడ హొసయల్లాపురలో 16 ఎకరాల ప్రాంతంలో ఈ చెత్త గుట్టలు పేరుకు పోయాయి. దీంతో ఈ చెత్త రాశులను కరిగించే ప్రక్రియకు కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. ప్రతి రోజు చెత్త రాశులకు నిప్పుపెట్టడం మామూలే. దాంతో ఆకాశం ఎత్తు వరకు వ్యాపించే పొగలు, కుళ్లిన కుక్కలు, పందులు, పశువుల కళేబరాలతో దుర్గంధాన్ని స్థానికులు భరించలేక పోయారు. పర్యావరణం పూర్తిగా దెబ్బతిని చుట్టు పక్కల రెండు మూడు కిలో మీటర్ల వరకు దుర్గంధం వ్యాపించేది.
అనుమతి ఆలస్యంతో పనులు జాప్యం
ఇది వ్యాధులకు కూడా కారకం అయ్యేదని, ఈ చెత్త రాశులను కరిగించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2017లోనే సూచించింది. ఆ మేరకు 2021లో డీపీఆర్‌ను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్ పంపింది. అయితే అనుమతి లభించింది మాత్రం 2023లోనే. టెండర్ ప్రక్రియ ముగిసింది ఈ ఏడాది ఏప్రిల్‌లో. వర్షాకాలం కావడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో గత అక్టోబర్ 15 నుంచి ప్రక్రియ ప్రారంభం అయింది. బయోమైనింగ్ ద్వారా చెత్తరాశులను స్ట్రాబేజ్ చేస్తున్నారు. ఆ తర్వాత అందులోని బయోఅర్త్ లేక బయోసాయిల్‌ను గార్డెన్‌తో పాటు వివిధ చోట్ల ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ఆర్డీఎఫ్ అట్టలు, రద్దీ కాగితాలు, చెప్పులు, టైర్లు తదితర వస్తువులను వేరు చేసి వచ్చిన రాశిని సిమెంట్ ఫ్యాక్టరీ తదితర చోట్ల ఉపయోగించవచ్చు. ఇందులో వచ్చే ఇనార్ట్ దేనికీ పనికి రాని వస్తువు. దీన్ని కేవలం క్వారీ తదితర గోతులు, గుంతలను నింపడానికి ఉపయోగించవచ్చు.
చెత్తసంస్కరణకు రూ.30 కోట్లు
కాగా ఈ విషయమై జంట నగరాల కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ ఈశ్వర్ ఉళ్లాగడ్డి మాట్లాడుతూ హుబ్లీ ధార్వాడలో సేకరించిన చెత్త 4.8 లక్షల టన్నులు ఉంది. హుబ్లీలో 3.6 లక్షల టన్నులు, ధార్వాడలో 1.2 లక్షల టన్నుల చెత్తను సంస్కరించడానికి ప్రభుత్వం నుంచి రూ.30 కోట్లు కేటాయించారు. సంస్కరించడానికి టెండర్ ఇచ్చాం. శాసీ్త్రయంగా ప్రతి రోజు 1100 టన్నులను సంస్కరిస్తున్నాం. వమూడు విభాగాల్లో విభజిస్తున్నాం. హుబ్లీ– కార్వార రోడ్డులో 19 ఎకరాలు, ధార్వాడ– హొసయల్లాపుర రోడ్డులో 16 ఎకరాల్లో చెత్తను బయోమైనింగ్ చేయడానికి 18 నెలల గడువు ఇచ్చాం. బయోమైనింగ్ అంటే సాధారణంగా మిశ్రమ చెత్తను శాసీ్త్రయంగా విభజించడమే. చెత్తను డంప్‌యార్డ్‌లోకి పోస్తారు. యంత్రాల సహాయంతో చెత్తరాశులను కరిగిస్తారు. ఈ తర్వాత బయోజీవులు, నైసర్గిక అంశాలైన గాలి, సూర్యుడి వెలుగుతో సంస్కరించడం ద్వారా చెత్తలోని బయోవిభజన అంశాలు కాలానంతరం విడిపోతాయి. దీన్ని బయోరెమిడియేషన్ ద్వారా స్థిరపరుస్తారు. కాగా సూరత్‌కు చెందిన బీహెచ్ పటేల్ అనే ఏజెన్సీ ఈ చెత్త నిర్వహణ భారాన్ని వహించింది. 2025లోగా ఈ చెత్తరాశులన్ని కరిగి ఉపయోగపడే ఫారాలుగా మారనున్నాయి.
బయోమైనింగ్ ద్వారా చెత్త నిర్వహణ ప్రక్రియ షురూ
నగరవాసులకు భారీ పొగ, దుర్గంధం త్వరలో దూరం
Comments
Please login to add a commentAdd a comment