బ్రిటిష్ పాలన తరహాలో పోలీసు లాఠీఛార్జి
సాక్షి,బళ్లారి: తమ హక్కుల సాధన కోసం వీరశైవ లింగాయత్ పంచమశాలి సమాజాన్ని 2ఎ కేటగిరిలో చేర్చాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ఉద్యమం చేపడుతున్న ఆందోళనకారులపై పోలీసులు విక్షణారహితంగా దాడులు చేయడం బాధాకరమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బెళగావిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వద్ద పంచమశాలి సమాజం పెద్దలు, స్వామీజీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న సమయంలో ముఖ్యమంత్రి స్వయానా వెళ్లి పరామర్శించి వారికి అండగా ఉండాల్సింది పోయి, పోలీసు అధికారులతో ప్రత్యేకంగా చర్చించి దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు లాఠీఛార్జి చేసిన తీరు చూస్తుంటే యావత్ సమాజం తలదించుకునేలా ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో తరహాలో పోలీసులు ప్రవర్తించి ఆందోళనకారులపై దాడులు చేసి గాయపరిచారన్నారు. ఎక్కబడితే అక్కడ కొట్టారని, ఆందోళనకారులు ఏమైనా తీవ్రవాదులా లేక ఉగ్రవాదులా? అంటూ ప్రశ్నించారు.
ఆందోళనకారుల అరెస్టు దారుణం
ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి గాయపరచడంతో పాటు జయమృత్యుంజయ స్వామిని, ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్‌ను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పునకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడీజీ హితేంద్ర శాడిస్ట్ తరహాలో వ్యవహరించి పోలీసులను ఆదేశించి 50 మందికి పైగా ఆందోళనకారులను గాయపరిచి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం సిద్దరామయ్య జోక్యం చేసుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. సీఎం క్షమాపణ చెప్పడంతో పాటు బాధితులను పరామర్శించి సాంత్వన పలకాలన్నారు. వీరశైవ పంచమశాలిని 2ఎ కేటగిరిలో చేర్చాలని చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఉందన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి సమగ్రాభివృద్ధికి గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంజనాద్రి అభివృద్ధి కోసం రూ.240 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
రెండేళ్లలో అంజనాద్రికి కొత్త రూపురేఖలు
గతంలో బీజేపీ సర్కార్‌లో అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై అంజనాద్రి అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేశారన్నారు. అందులో రూ.32 కోట్లతో రెండు యాత్రి నివాస్‌లను, ఒక్కొక్క దాంట్లో దాదాపు 500 మందికి పైగా బస చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అంజనాద్రి అభివృద్ధి కోసం చుట్టుపక్కల దాదాపు 70 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. 10 వేల మంది ఒకేసారి కూర్చొని భోజనాలు చేసేవిధంగా ప్రసాద నిలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతి తరహాలో అంజనాద్రి కొండకు వచ్చి వెళ్లేందుకు మెట్లను తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే రెండేళ్లలో అంజనాద్రి రూపురేఖలు మారిపోతాయన్నారు.రూ.1350 కోట్లతో రెండేళ్లలో అంజనాద్రిలో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
హనుమాన్ మాల ధరించి అంజనాద్రికి వచ్చి వెళ్లే భక్తులకు అక్కడ అన్నదాన వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 13న గంగావతిలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతున్నామన్నారు. దాదాపు 30 వేల మందికి పైగా జనం పాల్గొంటున్నారన్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. బాలింతల మృతికి సంబంధించి బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్, బీజేపీ నాయకులు డాక్టర్ బీ.కే.సుందర్ తదితరులు పాల్గొన్నారు.
పంచమశాలి రిజర్వేషన్ల కోసం
ఎగసిన ఉద్యమం
ప్రభుత్వం ఆందోళకారులకు
క్షమాపణ చెప్పాలి
రూ.240 కోట్లుతో అంజనాద్రి కొండ అభివృద్ధి
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment