హుబ్లీ: నగరంలో ఆన్‌లైన్ కేటుగాళ్ల బాధితులు నానాటికీ పెరిగి పోతున్నారు. తాజాగా ఈ కేటుగాళ్లు నగరానికి చెందిన ముగ్గురిని వేర్వేరుగా సుమారు రూ.42 లక్షలకు పైగా వంచించారు. వివరాలు.. వాట్సాప్ గ్రూప్‌లో పంపించిన హోటళ్లకు రివ్యూ చేసి ఇంట్లోనే కూర్చొని ఎక్కువ లాభాలు గడించవచ్చని నమ్మించి రాజధాని కాలనీ నివాసి కేడీ గురుప్రసాద్ హెబ్బార్ అనే వ్యక్తి నుంచి రూ.12.59 లక్షలను తమ ఖాతాల్లోకి బదలాయించుకొని వంచించారు. బాధితుడి మొబైల్ నెంబర్‌ను ఓమి దారా నెట్‌వర్క్ ఇండియా అడ్వైజరీ కంపెనీ వాట్సాప్ గ్రూపులో చేర్పించి హోటళ్లకు రివ్యూ చేసిన డబ్బులు సంపాదించవచ్చని నమ్మబలికారు. అనంతరం టెలిగ్రామ్ ఖాతాకు ఆయన్ను చేర్పించి ఆ ఖాతాలో ప్రీపెయిడ్ టాస్క్ కొనుగోలు చేసి వాటిని పూర్తి చేస్తే డబ్బులు గడించవచ్చని మభ్య పెట్టారు. ఆ మేరకు గురుప్రసాద్‌కు చెందిన వివిధ బ్యాంక్ ఖాతాల నుంచి దశల వారీగా రూ.12.59 లక్షలను బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలంటూ..
మరో ఘటనలో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఫేస్‌బుక్‌లో నమ్మించి నగరానికి చెందిన మజఫర్ గడిబాన అనే వ్యక్తి నుంచి రూ.23.45 లక్షలను బదలాయించుకొని వంచించారు. ముజఫర్ ఫేస్‌బుక్ వీక్షిస్తుండగా డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు అంటూ ఓ వాణిజ్య ప్రకటనను గమనించి సదరు లింక్‌ను తెరిచారు. ఈ క్రమంలో అక్కడి వాట్సాప్ లింక్ తీసుకొని గ్రూప్‌లోకి చేర్పించారు. డబ్బులు పెట్టుబడి పెట్టాలని ప్రేరేపించి దశల వారీగా రూ.23.45 లక్షలను కేటుగాళ్లు తమ ఖాతాలోకి బదలాయించుకున్నారు. బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మరో ఘటన స్థానిక బాబురావ్ చౌదరికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి మీరు బహుమానం గెలుచుకున్నారు. దీన్ని పొందాలంటే చార్జి అవుతుందని చెప్పి నమ్మించి ఆయన బ్యాంక్ ఖాతాల నుంచి రూ.6.46 లక్షల బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళ బంగారు ఆభరణాలు చోరీ
కాగా నగరంలో ఓ చోరీ ఘటనలో మహిళ బంగారు ఆభరణాలు తస్కరించారు. స్థానిక కేశ్వాపుర నివాసి కమలాగౌడర్ అనే ఆమె సిటీ బస్సులో ప్రయాణిస్తున్న వేళ దొంగలు ఆమె బ్యాగ్‌లోని 10 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.46 వేల విలువ చేసే వస్తువులను చోరీ చేశారు. స్థానిక హొసూరు బస్టాండ్ నుంచి నీలిజన్ రోడ్డు వరకు సాగిన బస్సు ప్రయాణంలో ఆమె ఈ వీటిని పోగొట్టుకున్నారు. చోరీ చేసిన అనంతరం నిందితులు పరారయ్యారని ఆమె ఉపనగర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వేర్వేరుగా ముగ్గురికి రూ.42 లక్షలకు పైగా వంచన
నానాటికీ పెరుగుతున్న ఆన్‌లైన్ కేటుగాళ్ల బాధితులు
Comments
Please login to add a commentAdd a comment