వైభవంగా హనుమాన్ రథోత్సవం
రాయచూరు రూరల్: నగరంలోని రాంపూర్‌లో ఆంజనేయ స్వామి జాతర, రథోత్సవాలు వైభవంగా జరిగాయి. మంగళవారం రాత్రి రథోత్సవాన్ని వందలాది మంది భక్తులు, కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు, జాగటకల్ బెట్టదయ్యప్ప స్వామి సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
బాల మందిరానికి
క్రీడాపరికరాల పంపిణీ
●పెద్ద మనస్సు చాటిన జెడ్పీ సీఈఓ
హుబ్లీ: చిత్రదుర్గ ప్రభుత్వ బాల మందిరం పిల్లలకు ఆ జిల్లా జెడ్పీ సీఈఓ ఎస్‌జీ సోమశేఖర్ తన సొంత డబ్బులతో క్రీడా పరికరాలను అందజేశారు. ఇటీవల ఆయన సదరు బాల మందిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలు తమకు వివిధ ఆటల పరికరాల అవసరం ఉందని తెలిపారు. స్పందించిన ఆయన తమ కార్యాలయంలో సంబంధిత బాల మందిర సిబ్బందికి ఈ ఆట పరికరాలను అందజేశారు. ఆ జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ భారతి ఆర్.బనకర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీ సవితా, జెడ్పీ ఉప కార్యదర్శి కే.తిమ్మప్ప, డీఎస్పీ సీకే దినకర్, ఆ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జగదీశ్ హెబ్బళ్లి, బాల మందిరం సూపరింటెండెంట్ జీవీ సంతోష్ జ్యోతి, కావేరమ్మ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సీఎం సేవలు మరవలేనివి
హొసపేటె: హంపీ కన్నడ యూనివర్సిటీలో మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీసీ డాక్టర్ పరమశివమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్.ఎం.కృష్ణ ప్రముఖ రాజకీయవేత్తగా పేరు పొందారన్నారు. కన్నడ నాట తాను ఎప్పుడూ సహనం కోల్పోలేదని, సవాళ్లను నిర్భయంగా ఎదుర్కొన్నారన్నారు. దివంగత ఎస్.ఎం.కృష్ణ కర్ణాటక 10వ ముఖ్యమంత్రిగా, 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారన్నారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పని చేశారని, పద్మవిభూషణ్ అవార్డు కూడా దక్కిందని తెలిపారు. లోక్‌సభ సభ్యులుగా, ఎంఎల్‌సీగా సేవలు అందించారన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో వాల్మీకి అధ్యయన పీఠానికి రూ.15 లక్షలు కేటాయించి పీఠాన్ని ప్రారంభించారన్నారు. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
నేత్రపర్వంగా
శరణబసవేశ్వర రథోత్సవం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కానామడుగు గ్రామంలో శరణ బసవేశ్వర రథోత్సవం మంగళవారం సాయంత్రం లక్షలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. శరణబసవేశ్వర రథోత్సవం సందర్భంగా రాష్ట్ర, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులు శరణబవేశ్వర మహారాజ్ కీ జై అంటూ రథాన్ని ముందుకు లాగారు. అగరవొత్తులు, అరటిపండ్లు, మిరియాల ముక్కలను భక్తితో సమర్పించారు. విజయనగర, చిత్రదుర్గ, దావణగెరె, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు రథోత్సవం పాల్గొన్నారు. కూడ్లిగి డీఎస్పీ మల్లేశప్ప మల్లాపూర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిజలింగప్ప సేవలు అజరామరం
రాయచూరు రూరల్: నగరంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నిజలింగప్ప 122వ జయంతిని ఆచరించారు. నగరంలోని నిజలింగప్ప కాలనీలో వెలసిన విగ్రహానికి సీనియర్ సిటిజన్ వీరనగౌడ పూలమాల వేసి జయంతిని నిర్వహించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన నిజలింగప్ప సేవలను కొనియాడారు. జయంతి కార్యక్రమంలో నారాయణరెడ్డి, సిద్దారెడ్డి, భీమరెడ్డి, అమరేగౌడలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment