రైతన్నకు బ్లేడ్ బ్యాచ్ కన్నం
● రూ.1.10 లక్షలు దోచుకున్న దొంగలు
హొసపేటె: బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకొని వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు వెంబడించి బ్యాగుకు బ్లేడుతో కన్నం వేసి రూ.1.10 లక్షల నగదును అపహరించిన సంఘటన గంగావతిలో బుధవారం జరిగింది. బసాపట్న గ్రామానికి చెందిన సురేంద్రబాబు అనే రైతు ఏపీఎంసీ మార్కెట్ ఆవరణలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ అభివృద్ధి శాఖలో తన పొదుపు ఖాతా నుంచి రూ.1.30 లక్షలు విత్‌డ్రా చేసి డబ్బులు బ్యాగ్‌లో పెట్టుకున్నారు. భద్రత కోసం బ్యాగ్‌ను భుజం మీద వేసుకొన్నారు. అనంతరం దురుగమ్మ ఆలయ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌కు వచ్చి పాస్‌బుక్‌లో నగదును నమోదు చేశాడు. బయటకు వచ్చి తన ఊరికి బయల్దేరబోతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సురేంద్రకు తెలియకుండా బ్యాగ్‌కు బ్లేడు వేసి కట్ చేసి రూ.500 రూపాయల రెండు కట్టలు, 100 రూపాయల విలువ చేసే ఒక కట్టను తొలగించారు. కొద్ది నిమిషాల తర్వాత సురేంద్ర తన బ్యాగ్‌ని తనిఖీ చేయగా నగదు చోరీకి గురైనట్లు గమనించారు. వెంటనే అక్కడే ఉన్న కొందరు 112 ఎమర్జెన్సీ సర్వీస్ వాహనానికి ఫోన్ చేశారు. ఈ మేరకు గంగావతి నగర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
తోటలో నవజాత శిశువు లభ్యం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా సరిహద్దు గ్రామమైన ఆలూరు వడ్డరహట్టి సమీపంలోని తోటలో జన్మించిన మూడు రోజుల నవజాత శిశువును బుధవారం కనుగొన్నారు. పొలంలో ఎవరో ప్రపసవించిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తకు సమాచారం అందించారు. అనంతరం తాలూకా శిశు అభివృద్ధి అధికారుల బృందం ఆలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ చిరంజీవి, సిబ్బందితో కలిసి నవజాత శిశువును తీసుకొచ్చారు. తగిన సంరక్షణతో పాటు శిశువుకు ఆరోగ్య పరీక్ష, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ డెవలప్‌మెంట్ శాఖ అధికారులతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. తోటలో అప్పుడే పుట్టిన బిడ్డకు ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యుడు శిశువును చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల కస్టడీకి అప్పగించారు.
రైతు సమస్యలు తీర్చండి
రాయచూరు రూరల్: జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలని కర్ణాటక రైతు సంఘం జిల్లా సంచాలకురాలు ఉమాదేవి డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆమె మాట్లాడారు. కంది, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఫసల్ బీమా పథకం పరిహారం, గత ఏడాది కరువు, ఈ ఏడాది అతివృష్టి వల్ల నష్టపోయిన పంటల రైతులకు పరిహారం అందించాలన్నారు. నారాయణపుర కాలువ, రాంపూర్ ఎత్తిపోతల పపథకాల్లో రైతులకు భూ పరిహారం అందించాలని, రైతుల పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలన్నారు.
విద్యార్థులకు పట్టాల ప్రదానం
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కళ్యాణ కర్ణాటక భాగంలోని విద్యార్థులు విద్యా రంగంలో బిహార్ రాష్ట్ర విద్యార్థులను అధిగమించాలని స్థానిక కన్నడ పత్రిక సంపాదకుడు బాబూరావ్ యడ్రామి పిలుపునిచ్చారు. కలబుర్గి హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థ వీరమ్మ గంగ సిరి మహిళా కళాశాలలో పాత్రికేయుల కోర్సుల ఘటికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. యూపీఎస్‌సీ, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలకు బిహార్ అభ్యర్థులు వస్తున్న నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జే) ప్రకారం రిజర్వేషన్ల్లతో ముందుండాలని అభ్యర్థించారు. తల్లిదండ్రుల ఆశలకు, ఆశయాలకు నీళ్లు వదలకుండా పేరు ప్రఖ్యాతులు తెచ్చేవిధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామలింగ, మండలి సభ్యుడు నాగన్న, ప్రిన్సిపాల్ రాజేంద్ర, మోహన్‌రాజ్, రవీంద్ర, మహేష్, జ్యోతి, సుభాష్, శివలీల, దానమ్మ, ప్రమోద్, కవిత, సుష్మా, ఆశాలున్నారు.
విద్యార్థులకు పుస్తకాల వితరణ
రాయచూరు రూరల్ : సాంఘీక సంక్షేమ శాఖ ఆధీనంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీఎం, మైనార్టీ హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు. మంగళవారం నగరంలోని దేవర కాలనీ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ ప్రసంగిస్తూ పేదరికంలో పుట్టిన విద్యార్థులు విద్యనభ్యసించి క్రియాశీలురుగా చదివి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉత్తమ సేవలందించాలన్నారు. కార్యక్రమంలో రంగప్ప నాయక్, చంద్రశేఖర్ రెడ్డి, రాఘవేంద్ర, హనుమంతరాయ, భీమేష్, మంజుల, రావుత్‌రావ్, ప్రసన్నలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment