బనశంకరి: వ్యాపారాల గురించి వీధుల్లో కరపత్రాలను పంచడం, మైకులో ప్రచారం చేయడం చూసి ఉంటారు. కానీ కొందరు ఓ యాప్ ప్రచారానికి వినూత్న పంథా అనుసరించారు. ఆహార వితరణ అప్లికేషన్ పేరున్న బిల్ బోర్డులను వీపునకు తగిలించుకుని నగర రోడ్లపై నడిచారు. రోషన్ అనే వ్యాపారి ఈ ఫోటోను ఎక్స్‌లో పోస్టు చేయగా వైరల్ అయ్యింది. దీనిపై కొందరు ఆవేదన వ్యక్తంచేశారు. ఆ కూలీలను మనుషులుగా కూడా చూడరా? అని ప్రశ్నించారు. మనుషులను ఇలా వాడుకోవడం దారుణమైన విషయమని, అమానుషంగా కనిపిస్తోందని వాపోయారు.
ఐఏఎస్‌పై ఫర్నీచర్ కేసు రద్దు
మైసూరు: ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి గతంలో మైసూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వ అతిథి గృహంలో అదృశ్యమైన సామగ్రికి అయ్యే ఖర్చును అప్పటి అతిథిగృహం మేనేజర్ విశ్వాస్ తాజాగా చెల్లించారు. దీంతో రోహిణి సింధూరిపై ఉన్న సామగ్రి అదృశ్యం కేసు రద్దయింది. పాలన శిక్షణా సంస్థ అతిథిగృహంలో కనిపించకుండా పోయిన ఫర్నీచర్‌కు సంబంధించిన మొత్తాన్ని ఆమె వేతనంలో నుంచి మినహాయించి తమకు ఇవ్వాలని మైసూరు నగర పాలన శిక్షణ సంస్థ ఏటీఐ కార్యదర్శికి లేఖ రాసింది. ఇంతలో మేనేజర్ అయిన విశ్వాస్ రూ.77,296 జమ చేయడంతో కేసు మూతపడింది.
దళితులపై అగ్రవర్ణాల దాడి
మైసూరు: కులాంతర వివాహం నేపథ్యంలో ముగ్గురు దళిత యువకులపై అగ్రవర్ణాల వారు దాడి చేసిన ఘటన జిల్లాలోని నంజనగూడు తాలూకా గీకళ్లి గ్రామంలో జరిగింది. గ్రామ నివాసులు ఆకాశ్, నితిన్, సంతోష్‌లు గాయపడి ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజుల క్రితం గీకళ్లిలో కులాంతర వివాహం జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అగ్ర కులానికి చెందిన ముగ్గురు యువకులు దళిత యువకులపై దాడి చేశారు. కాగా, నిందితులను బంధించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత నియోజకవర్గంలోనే దళితులకు భద్రత కరువైందని, రక్షణ కల్పించకపోతే ఉగ్రపోరాటం చేపడతామని హెచ్చరించారు.
దొంగ పట్టివేత
మైసూరు: ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగని సీసీబీ పోలీసులు అరెస్టు చేసి రూ.18 లక్షల విలువ చేసే 217 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 కేజీల వెండి వస్తువులను, ఒక బైక్‌ని స్వాధీనపరచుకున్నారు. సీసీబీ పోలీసులు గస్తీలో ఉండగా నగరంలోని మండి మొహల్లా ఈద్గా మైదానం వద్ద ఓ యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని ప్రశ్నించారు. అతను నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఏడు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఒక బైక్‌ను కూడా చోరీ చేసినట్లు వెల్లడించాడు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరో నిందితుని కోసం గాలిస్తున్నారు.
బావిలో పడి ఇద్దరు
చిన్నారుల మృతి
యశవంతపుర: దూర ప్రాంతం నుంచి కూలీ పనుల కోసం వస్తే కడుపుకోతే మిగిలింది. కాఫీ తోటలోని బావి వద్ద ఇద్దరు చిన్నారులు ఆటలాడుతూ బావిలోకి పడడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిక్కమగలూరు జిల్లా కొప్ప తాలూకా అమ్మడి గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. మధ్యప్రదేశ్ నజీరాబాదుకు చెందిన సునీతాబాయి, అర్జున్‌సింగ్ అనే వలస కూలీ దంపతులు అమ్మడి గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరు కాఫీ తోటల్లో కూలి పనికి వెళ్తుంటారు. వీరి పిల్లలు సీమా (6), రాధిక (2) ఆడుకుటూ బావిలో పడిపోయారు. పనుల నుంచి వచ్చాక తల్లిదండ్రులకు పిల్లలు కనపడలేదు. దీంతో గాలించగా ఇంటి పక్కనే ఉన్న బావిలో చిన్నారుల మృతదేహాలు బయట పడ్డాయి. కొప్ప గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేశారు.
మరాఠాల ధర్నా
యశవంతపుర: కర్ణాటక మాజీ మంత్రి ప్రభు చవాన్‌కి మహారాష్ట్రలో చేదు అనుభవం ఎదురైంది. కొల్హాపూర్‌లో మహాలక్ష్మీ దేవస్థానానికి వెళుతున్న ఆయనను శివసేన కార్యకర్తలు అడ్డగించారు. బెళగావిలో మరాఠాలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి, బెళగావిలో మహా మేళావ్ జరపడానికి అనుమతించలేదంటూ నినాదాలు చేశారు. చవాన్‌ను కదలకుండా ఘెరావ్ చేశారు. ఆయన వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి ఆలయానికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment