బైక్, నగల దొంగలకు బేడీలు
● బాగేపల్లిలో పట్టివేత
బాగేపల్లి: బాగేపల్లితో పాటు చుట్టుపక్కల, వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పట్టుకుని 20 బైకులను స్వాధీనపరచుకున్నారు. ఇటీవల బాగేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో బైక్‌ల దొంగతనాలు పెరిగాయి. దీంతో ఫిర్యాదుల మేరకు ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ వర్ణి నేతృత్వంలో పోలీసులు విచారణ సాగించారు. పొరుగున ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమంత్, కే.మణికంఠ అనే ఇద్దరు నిందితులను పట్టుకుని విచారణ చేశారు. నిందితులు బాగేపల్లి, యశవంతపుర, యలహంక, కొప్పళ, సింధనూరు, కామాక్షిపాళ్య, హిరియూరు, మాదనాయకనహళ్లి, మంచేనహళ్లి తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో బైక్ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. వారి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 20 బైకులను స్వాధీనపరచుకుని నిందితులను జైలుకు తరలించారు.
రూ.4 లక్షల నగలు స్వాధీనం
మరో కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకుని వారి నుంచి రూ.4 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనపరచుకున్నారు. ఇటీవల ఇద్దరి ఇళ్లలో డబ్బు, బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. దీంతో దర్యాప్తు చేపట్టి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంక టేష్, సురేష్ అనే ఇద్దరు నిందితులను పట్టుకుని వారి నుంచి రూ.4 లక్షల విలువ చేసే బంగారు సొత్తును స్వాధీనపరచుకున్నారు.
దర్శన్ బెయిలు పని పూర్తి
బనశంకరి: చిత్రదుర్గం రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడు దర్శన్ సోమవారం సెషన్స్‌కోర్టు ముందు హాజరై బెయిల్ ప్రక్రియను పూర్తిచేశారు. తరువాత మళ్లీ చికిత్స కోసం బీజీఎస్ ఆసుపత్రిలో చేరారు. పూర్తిస్థాయి బెయిల్ లభించడంతో స్నేహితుడు దన్విర్, సోదరుడు దినకర్ ఆయనకు షూరిటీ ఇచ్చారు. జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇంకా అనారోగ్యంతో ఉన్నట్లు దర్శన్ ఇబ్బందిపడుతూ నడిచాడు. కోర్టు లోపల నిలబడలేనని, అలాగే కూర్చోవడం కూడా కష్టంగా ఉంటుందని తెలిపాడు. ఈ సందర్భంగా చుట్టూ పోలీసు భద్రత ఏర్పాటైంది. దర్శన్‌కు బుధవారం వరకు చికిత్స కొనసాగే అవకాశం ఉంది.
సీఎం తక్షణం
క్షమాపణ చెప్పాలి
దొడ్డబళ్లాపురం: రిజర్వేషన్లు కల్పిస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన సీఎం సిద్ధరామయ్య తక్షణం తమ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని కూడల సంగమ పీఠాధిపతి బసవ జయ మృత్యుంజయస్వామీజీ డిమాండ్ చేసారు. బెళగావి పట్టణంలోని చెన్నమ్మ సర్కిల్లో సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... లింగాయత్‌లపై దాడి చేయాలన్న సీఎం మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని, రిజర్వేషన్ల విషయంలోనూ మాట తప్పిన ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలన్నారు. పంచమసాలి సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సీఎం అనడం ఆయన అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment