కలగానే.. కార్పొరేషన్ ఎన్నికలు
శివమొగ్గ: శివమొగ్గ మహానగర పాలికె అంటే... సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప సొంత జిల్లా. కానీ ప్రజాపరిపాలన మాత్రం అందని ద్రాక్షే అవుతోంది. మేయర్, కార్పొరేటర్లు అని ఎవరూ లేరు. పాలికెలో ప్రజాప్రతినిధుల పాలన లేకుండా ఇప్పటికే ఏడాది పూర్తయింది. ఎన్నికల కోసం పార్టీలు, ఔత్సాహికులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వార్డుల విభజన, కొత్త ప్రాంతాల విలీనం పేరుతో ప్రభుత్వం ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా సమస్యలు పేరుకుపోతున్నా గట్టిగా మాట్లాడేవారు లేరని ప్రజలు మండిపడుతున్నారు. పాలికె పరిధి పెంపునకు సమాచారం సేకరించే ప్రక్రియ గత కొన్ని నెలలుగా సాగుతోంది. సమాచార సేకరణ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ముగిసే సూచనల్లేవు.
తేలని శివారు గ్రామాల విలీనం
శివమొగ్గ పాలికె ఉన్నత స్థాయి వర్గాలు అందించిన వివరాల ప్రకారం ఇంతవరకు పూర్తి స్థాయిలో సమాచార సేకరణ జరగలేదు. నగరానికి ఆనుకుని ఉన్న గ్రామ పంచాయతీల ఆధీనంలోని 23 ప్రాంతాలను పాలికెలోకి చేర్చడంపై ఇంకా పరిశీలన సాగుతోంది. దీనికి గ్రామ పంచాయతీలు అంగీకరించాలి. వీటిని పూర్తిచేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే పాలికె వ్యాప్తి పెంపు అమలులోకి వస్తుంది. ఆ తరువాత వార్డుల విభజన జరగాలి. ఇదంతా ఒక దశకు రావడానికి చాలా సమయం పడుతుందని పాలికె ఉన్నత వర్గాలు తెలిపాయి. అప్పటివరకు ఎన్నికల మీద ఆశలు పెట్టుకునే పనిలేదు.
శివమొగ్గ, బెంగళూరు సహా అనేక పాలికెలకు పెండింగ్
వార్డుల విభజన, కొత్త ప్రాంతాల విలీనం అసంపూర్తి
కార్పొరేటర్లు లేక వార్డుల సమస్యలు గాలికి
రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి
రాష్ట్రంలో బెంగళూరు, శివమొగ్గ, మైసూరు, తుమకూరు పాలికెలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో అన్నది యక్షప్రశ్నగా మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిపేందుకు ఎంతమాత్రం ఉత్సాహం చూపడం లేదు. ఏదో ఒక కారణం చెప్పి అధికారులతో పరిపాలన సాగిస్తోంది. దీంతో ప్రజలు తమ ఇబ్బందులను చెప్పుకోవడానికి స్థానిక కార్పొరేటర్లు ఎవరూ లేరు. ఎన్నికలూ జరగడం లేదు, వ్యాప్తి పెంపు కావడం లేదని శివమొగ్గవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment