గోవా డ్రగ్స్ వ్యాపారి అరెస్టు
బనశంకరి: గోవా నుంచి మంగళూరు నగరానికి కొకై న్ మత్తుపదార్థం పంపుతున్న నైజీరియన్ ను బుధవారం అక్కడి సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 30 గ్రాముల కొకై న్‌ను సీజ్ చేశారు. మైకేల్ ఒకాపర్ ఓడిక్పో (44) నిందితుడు. మార్చిలో సదాకత్, మహమ్మద్ ఆష్పాక్ అనే ఇద్దరు డ్రగ్స్ విక్రేతలను మంగళూరు పోలీసులు అరెస్ట్‌చేశారు. వారిని విచారించగా ఓడిక్పో గురించి చెప్పారు. దీంతో ఉత్తర గోవాలోని కాలగూట్‌కు వెళ్లి ఓడిక్పో ని అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 30 గ్రాములు కొకై న్, కారు, రెండు మొబైల్స్, రూ.4500 నగదు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలురూ.11.25 లక్షలని తెలిపారు. 2012లో వ్యాపార వీసాతో భారత్ కు చేరుకుని ముంబైలో సుమారు ఏడాదిన్నర ఉన్నాడు. తరువాత గోవాలో మకాం వేసి డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడని తెలిపారు. మూడుసార్లు అరెస్టయి విడుదలైనా మళ్లీ అదే దందా చేయడం గమనార్హం. మంగళూరుకు తరలించి విచారణ చేపట్టారు.
సమాచారం ఇవ్వని
అధికారికి జరిమానా
మైసూరు: సమాచార హక్కు దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వకుండా సతాయించిన నగర పాలికె వలయ కార్యాలయం–9 అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్‌కు కర్ణాటక సమాచార కమిషనర్ వీహెచ్‌సీ సత్యన్ రూ.25 వేల జరిమానా విధించారు. సమాచార హక్కు కార్యకర్త ఎస్‌టీ సదానందగౌడకు రూ.10 వేల పరిహారం అందించాలని సూచించారు. వివరాలు.. నగర పాలికెలో వార్డు నంబరు– 53 సిద్ధార్థ నగర సమీపంలో నిర్మాణ దశలో ఉన్న జీ ప్లస్ 3 భవనం ప్లాన్ ఉల్లంఘనపై తీసుకున్న చర్యల గురించి సంపూర్ణ సమాచారం ఇవ్వాలని కోరుతూ సదానందగౌడ అర్జీ వేశారు. దీనికి శివకుమార్ స్పందించలేదు. 475 రోజులైనా ఆయన సమాచారం ఇవ్వకపోవడంతో సమాచార కమిషనర్ ఈ మేరకు జరిమానా విధించారు.
అమిత్‌షాపై సీఎం మండిపాటు
శివాజీనగర: అంబేడ్కర్ ఈ భూమిపై పుట్టకపోతే, నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చేది కాదు. ఊరిలో గొర్రెలు కాపరిగా ఉండేవాడిని అని సీఎం సిద్దరామయ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. అంబేడ్కర్ గురించి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ మనసులోని భావాన్ని చెప్పారని పరోక్షంగా కేంద్రమంత్రిని హేళన చేశారు. కానీ బాబా సాహెబ్‌పై మాకు అపారమైన అభిమానం ఉంది. అంబేడ్కర్ మాకు వ్యసనం కాదు. నిత్య స్మరణం. ఊపిరి ఉన్నంత వరకు అంబేడ్కర్ స్మరణ ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం లేకుంటే మీరు హోం మంత్రిగా కాకుండా మీ గ్రామంలో ఎక్కడైనా పాత సామాన్ల దుకాణం పెట్టుకునేవారని అన్నారు. మీ మిత్రుడు నరేంద్ర మోదీ కూడా ప్రధాని కాకుండా, ఏ రైల్వే స్టేషన్‌లో టీ అమ్ముకొని ఉండాల్సి వచ్చేదేమో? అని దుయ్యబట్టారు.
21న ఆశ్రయధామలో
జగనన్న పుట్టినరోజు వేడుక
బనశంకరి: వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం పిలుపుమేరకు ఎప్పటిలాగే సేవామార్గంలో జన నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను బెంగళూరులో నిర్వహించనున్నారు. డిసెంబరు 21వ తేదీన జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో కృష్ణరాజపురం సమీపంలోని శభరి బెళతూరు ఆశ్రయధామలో వేడుకలు జరుగుతాయని ఐటీ విభాగం నేతలు తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు కేక్ కటింగ్, అన్నదానం జరుపుతారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఆశ్రయధామలో వృద్ధులు, పిల్లలకు చలికాలం కావడంతో స్వెట్టర్లు, సాక్స్‌లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. హాజరయ్యేవారు వీటిని తీసుకువచ్చి విరాళమిస్తే ఉపయుక్తంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు.
సీఎం భార్య పీఏ నుంచి
బెదిరింపులు: స్నేహమయి
మైసూరు: ముడా ఇళ్ల స్థలాల కేసు పోరాటం నుంచి తప్పుకోవాలని తనపై, తన కుటుంబంపై తీవ్ర ఒత్తిడి వస్తోందని ఫిర్యాదుదారు స్నేహమయి కృష్ణ మైసూరు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ కి ఫిర్యాదు చేశారు. కేసు నుంచి తప్పుకోవాలని హర్ష, శ్రీనిధి అనే వారు బెదిరించారు. మరొక ఆర్టీఐ కార్యకర్త గంగరాజుకు రూ.3 కోట్లు ఇస్తున్నామని, ఇప్పటికే అడ్వాన్స్‌గా రూ.1.50 కోట్లను అందించామని వారు చెప్పారు. సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి పీఏ హర్ష ప్రారంభంలో నాపై ఒత్తిడి తెచ్చారు. నా కుమారున్ని కూడా ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. దర్యాప్తు జరపాలని తమ ఇంటి సీసీ కెమెరా దృశ్యాలతో సహా ఫిర్యాదు చేశానన్నారు. అలాగే డీజీపీ, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కొమ్మ పడి బాలునికి తీవ్రగాయాలు
శివాజీనగర: చెట్టు కొమ్ము పడి బాలునికి తలకు తీవ్ర గాయాలు అయిన ఘటన బెంగళూరులో నంది దుర్గా రోడ్డులో జరిగింది. జాడెం లుకస్ (14) స్కూలుకు తండ్రితో కలసి స్కూటర్‌లో వెళుతున్నపుడు చెట్టు కొమ్ము విరిగి సరిగ్గా బాలుని తలపై పడింది. బాలుని తలకు తీవ్ర గాయాలయ్యాయి. తండ్రి డేవిడ్ మాట్లాడుతూ ఎప్పటిలాగే కుమారున్ని బడిలో వదిలేందుకు వెళ్తుండగా కొమ్మ పడిందని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను, కొమ్మలను ఎప్పటికప్పుడు కొట్టివేయనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment