అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ ధర్నా
కోలారు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేడ్కర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం నగరంలోని మెక్కె సర్కిల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఊరుబాగిలు శ్రీనివాస్ మాట్లాడుతూ... కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అంబేడ్కర్ గురించి సరిగా తెలియక నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మతతత్వ పార్టీ బీజేపీ, ఆ పార్టీ నాయకులకు అంబేడ్కర్ పేరును జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వీరికి అధికారంలోకి రావడానికి మాత్రమే రాజ్యాంగం కావాలి. అంతేకాని అంబేడ్కర్ పేరు మాత్రం వద్దు. బీజేపీ నాయకులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. అదేవిధంగా బెళగాం సమావేశాలలో మంతి లక్ష్మీ హెబ్బాళ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీటీ రవిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో కాంగ్రెస్ నాయకులు ఎల్‌ఎ మంజునాథ్, నగర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాద్‌బాబు, జిల్లా వివిధ కాంగ్రెస్ విభాగాల అధ్యక్షులు కె జయదేవ్, హొన్నేనహళ్లి యల్లప్ప, నాగరాజ్, సుధీర్, రంగనాథ్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
దళిత సంఘం ఆధ్వర్యంలో...
మాలూరు : లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేడ్కర్‌ను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం దళిత సంఘర్ష సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంఘటన సంచాలకుడు కోడూరు గోపాల్ అమిత్ షాపై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా దేశ ప్రజలను క్షమాపణ కోరాలన్నారు. ఈ సందర్భంగా చాకనహళ్లి నాగరాజ్, ఎస్‌ఎం రాజు, ఆటో శ్రీనివాస్, తిప్పసంద్ర శ్రీనివాస్, ఆర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment