10 నిమిషాల్లో పూర్తి | - | Sakshi
Sakshi News home page

10 నిమిషాల్లో పూర్తి

Published Sat, Jan 18 2025 1:21 AM | Last Updated on Sat, Jan 18 2025 1:21 AM

10 ని

10 నిమిషాల్లో పూర్తి

యశవంతపుర: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దోపిడీదారులు చెలరేగుతున్నారు. ఆయుధాలతో వచ్చి కాల్పులకు తెగబడి బ్యాంకులను,ఏటీఎంలను లూటీ చేస్తున్నారు. దుండగులు ఏటీఎంలు, బ్యాంకులను టార్గెట్‌ చేసుకొని పట్టపగలే అందరూ చూస్తుండగానే దోపిడీలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బీదర్‌లో ఏటీఎంను దోచిన ఘటన మరవక ముందే మంగళూరు ఉళ్లాలలో శుక్రవారం పట్టపగలే బ్యాంక్‌ను దోపిడీ చేశారు. బ్యాంకు సిబ్బందికి తుపాకీ చూపించి అగంతుకులు దోపిడీ చేసి పారిపోయారు. దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాల తాలూకా కోటికారు వ్యవసాయ సేవా సహకార బ్యాంక్‌ కేసీ రోడ్డు శాఖలో పట్టపగలే ఫియట్‌ కారులో వచ్చిన ఐదు మంది అగంతుకుల బృందం బ్యాంక్‌ సిబ్బందికి తుపాకీ చూపించి డబ్బులను దోచుకెళ్లారు. డబ్బుతో పాటు బ్యాంక్‌లో వినియోగదారులు ఉంచిన బంగారాన్ని దోచుకొని మంగళూరు వైపు కారులో పారిపోయారు.

ఉన్నతాధికారుల పరిశీలన

దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు, ఉన్నత అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళూరులో ఉండగా ఉళ్లాల కోటికారు వ్యవసాయ సేవా సహకార బ్యాంక్‌ దోపిడీకి గురికావటంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అక్కడి ఎమ్మెల్యే, విధానసభ సభాపతి యూటీ ఖాదర్‌ ఉళ్లాల బ్యాంకు వద్దకు వెళ్లి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఇన్‌చార్జి మంత్రి పరిశీలన

బీదర్‌ ఘటనకు సంబంధించి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఈశ్వర ఖండ్రె శుక్రవారం మరో మంత్రి రహీంఖాన్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఏడీజీపీ హరిశేఖరన్‌, ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసును త్వరగా విచారించి నిందితులను పట్టుకోవాలని సూచించారు. సీఎంఎస్‌ ఉద్వోగి గిరి వెంకటేశ్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీనిచ్చారు. ప్రత్యేక పరిహారం ఇచ్చే విషయంపై సీఎం సిద్ధరామయ్య చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న మరో ఉద్యోగి శివకుమార్‌ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని కేర్‌ ఆస్పత్రి వైద్యులకు సూచించినట్లు మంత్రి తెలిపారు. వైద్య ఖర్చులను కొంతవరకు ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

కారులో ఉడాయిస్తున్న దుండగులు

ఆయుధాలతో వచ్చి దోచుకుంటున్న ముసుగు దొంగలు

మొన్న బీదర్‌లో ఏటీఎం నగదు దోచుకున్న దుండగులు

నిన్న ఉళ్లాలలో ఆయుధాలతో సహకార బ్యాంక్‌లోకి చొరబాటు

సిబ్బందికి తుపాకీ చూపించి నగదుతో ఉడాయింపు

వరుస ఘటనలతో భీతిల్లుతున్న బ్యాంకర్లు

ప్రభుత్వం ఉందో.. లేదో తెలియడం లేదు

బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర

మైసూరు : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిపాలననను పూర్తిగా గాలికి వదిలివేసిందని, రాష్ట్రంలో ఎక్కడ చూసిన దాడులు, అక్రమాలు, అకృత్యాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం కాని, ముఖ్యమంత్రి కాని పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర మండిపడ్డారు. శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో కూడా అర్థం కావడం లేదన్నారు. గుల్బర్గాలో బాలికపై ఆత్యాచారం జరిగిందన్నారు. బెంగళూరులోని చామరాజపేటలో ఆవుల పాల పొదుగులను దుండగులు కోసేశారన్నారు. నంజనగూడులో దేవుడికి మొక్కుగా వదిలిన ఆవు, దూడల తోకలను కత్తిరించి ముక్కలుగా చేశారన్నారు. బీదర్‌లో పట్టపగలే ఏటీఎంలో నగదు నింపడానికి వెళ్లిన వారిపైన దుండగులు కాల్పులు జరిపి హత్య చేసి లక్షలాది రూపాయల నగదుతో పారిపోయారన్నారు. దుండగుల పైన, కిరాతకుల పైన కాంగ్రెస్‌ ప్రభుత్వం కొరడా ఝళిపించక పోవడంతో ఇలాంటి ఆగడాలు జరుగుతున్నాయన్నారు.

బీదర్‌ ఘటనలో

నిందితుల గుర్తింపు

ఐదుగురు అగంతకులు కళ్లకు ముసుగులు ధరించి బ్యాంకులోకి చొరబడ్డారు. అదే సమయంలో బ్యాంకులో ఐదు మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. అంగతకులు సిబ్బందికి తుపాకీ చూపించి అందరినీ కింద కూర్చోమని చెప్పారు. అప్పుడే బ్యాంకులోకి వచ్చిన మేనేజర్‌ లాకర్‌ తెరిచి ఉండగా ఇద్దరు వెళ్లి లాకర్‌లోని డబ్బు, బంగారాన్ని సంచిలోకి నింపుకొని అప్పటికే సిద్ధంగా ఉంచిన ఫియట్‌ కారులో పారిపోయారు. వచ్చినవారందరూ హిందీ భాషలో మాట్లాడినట్లు బ్యాంకు సిబ్బంది పోలీసులకు తెలిపారు.

యశవంతపుర: బీదర్‌లో సీఎంఎస్‌ సిబ్బందిని హత్య చేసి దోపిడీకి పాల్పడిన నిందితులను గుర్తించినట్లు శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ హరిశేఖరన్‌ తెలిపారు. అయన శుక్రవారం బీదర్‌లో విలేకరులతో మాట్లాడారు. షూటౌట్‌ కేసును సీరియస్‌గా తీసుకొని కలబురగి డీఐజీ, ఎస్పీల నేతృత్వంలో వేగంగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణకు ప్రత్యేక బృందాలు వెళ్లి అక్కడి క్రైం పోలీసుల సాయంతో విచారణను చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుల ఆనవాళ్లు లభించాయి. గతంలోను పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు బయట పడింది. బీదర్‌లో కాల్పులు జరిపి హత్య చేసిన తరువాత దోచుకెళ్లిన ఇద్దరు నిందితులు హైదరాబాద్‌కు వెళ్లినట్లు గుర్తించినట్లు వివరించారు. ఈ ఇద్దరు నిందితులు హైదరాబాద్‌ నుంచి మరో నగరానికి వెళ్లడానికి ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో టికెట్‌ బుక్‌ చేసిన విషయాన్ని గుర్తించామన్నారు. సీఎంఎస్‌ ట్రాక్‌ పెట్టెలో రూ.87 లక్షల నగదు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయట పడిందన్నారు. ఘటనా స్థలాన్ని డీజీపీ అజయ్‌ హిలోరి, ఎస్పీ ప్రదీప్‌ గుంటె పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
10 నిమిషాల్లో పూర్తి 1
1/2

10 నిమిషాల్లో పూర్తి

10 నిమిషాల్లో పూర్తి 2
2/2

10 నిమిషాల్లో పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement