ఉద్యోగ సృష్టితో పేదరికం దూరం
● ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి
మైసూరు: ఉద్యోగాల సృష్టితో మాత్రమే పేదరికాన్ని నిర్మూలించవచ్చని ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రైవేట్ హోటల్‌లో బేరుండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైసూరు వ్యాపారవేత్తల వేదిక సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి కూడా ఉత్తమ విద్య, ఆరోగ్యం, అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలన్నారు. ఉచిత నగదు ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి పథకాలను ప్రభుత్వాలు పెట్టవద్దన్నారు. ప్రతి ఒక్కరికీ విద్యను అందించడంతో పాటు వారికి ఎలాంటి నైపుణ్యం అవసరమో గుర్తించి అందులో శిక్షణ ఇవ్వడంతోపాటు మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తే వారి కాళ్లపై వారు నిలబడతారన్నారు. ఇరతరులపై ఆధారపడకుండా జీవిస్తారన్నారు. వ్యాపారం అనేది సంపదను సృష్టించడంతో పాటు అనేక ఉద్యోగాలను సృష్టించి అన్ని వర్గాల వారికి ఉపాధి కల్పించాలన్నారు. వ్యాపారాభివృద్ధి అనంతరం సమాజాభివృద్ధి కోసం వ్యాపారవేత్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుధామూర్తి, ఎంపీ యదువీర్, కృష్ణదత్త చామరాజ ఒడెయర్, యదువీర్ భార్య త్రిషికాకుమారి పాల్గొన్నారు.
ప్రేమోన్మాది ఘాతుకం
● పెళ్లికి నిరాకరించిందని కత్తితో దాడి
● ప్రియురాలికి తీవ్ర గాయాలు
● నిందితుడి అరెస్ట్
కృష్ణరాజపురం: పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు. ఈఘటన బెంగళూరులోని జేజే నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అజయ్ అనే యువకుడు ఒక మైనర్ బాలికను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించాడు. మైనర్ బాలికను మభ్యపెట్టినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అజయ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి ఇటీవల విడుదలై వచ్చిన అజయ్.. మళ్లీ ఆ యువతిని కలిశాడు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించింది. దీంతో ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. తమకు వివాహం చేయాలని ఈ జంట కోరగా యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. అయితే అజయ్ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. దీంతో అజయ్ వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈక్రమంలో ఆ యువతి పెళ్లికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన అజయ్ ఆమెను కత్తితో దాడి చేశాడు. పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment