ఇన్‌స్టా లైక్.. తీసింది ఉసురు
బనశంకరి: సోషల్ మీడియా గొడవల వల్ల ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌లో మరో యువతికి కాబోయే భర్త లైక్ కొట్టినందుకు యువతి అతన్ని మందలించింది. ఇది నచ్చని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా పూంజాకట్టి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుక్కిప్పాడి నివాసి చేతన్ (25) కాంతార మాదిరి దేవుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.
కుందాపురలో చైతన్య అనే యువతి ఇన్‌స్టా లో పరిచయమైంది. స్నేహం ఏర్పడి ప్రేమకు దారితీసింది. 8 నెలల క్రితం ఇరువురికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెల 21వ తేదీన చేతన్ ఇన్‌స్టాలో మరో యువతి ఫోటోకు లైక్ కొట్టాడు. ఈ విషయమై ప్రశ్నించడానికి ప్రియురాలు చైతన్య, చేతన్ ఇంటికి వెళ్లింది. వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్ కొట్టావని గొడవకు దిగింది. క్రమంగా తీవ్ర వివాదంగా మారింది. మనస్థాపం చెందిన చేతన్ వెంటనే పై గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. నీ కొడుకు నిద్రపోయాడని, పిలిచినా లేవలేదని చైతన్య కాబోయే అత్త పుష్పకు ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి చేరుకున్న చేతన్ తల్లి ఇంటి పై గదిలోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
ప్రియురాలి గొడవతో ప్రియుడు ఆత్మహత్య
సహజీవనం.. ఆపై బలవన్మరణం
హుబ్లీ: ఇన్‌స్టా గ్రామ్ ప్రేమ వలలో చిక్కి ధార్వాడలో రామదుర్గకు చెందిన శ్వేత (24) అనే వివాహిత యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. ఆమెకు మూడున్నరేళ్ల క్రితం రామదుర్గకు చెందిన విశ్వనాథ్‌తో పెళ్లి అయింది. ఇన్‌స్టాలో శ్వేతకు ధార్వాడ తాలూకా శివళ్లి గ్రామానికి చెందిన విజయ్ నాయకర్‌తో స్నేహం మొదలై ప్రేమకు దారితీసింది. ఫలితంగా భర్తను వదిలేసి ఆమె శ్రీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో సహజీవనం ప్రారంభించింది. శ్వేత కుటుంబ సభ్యులు విజయ్ ఇంటికి వెళ్లి ఇది సబబు కాదని మందలించారు. వీలైతే ఆమెను పెళ్లి చేసుకో, ఊరికే ఇలా తమ కుమార్తె సంసారాన్ని నాశనం చేయవద్దు అని బుద్ధిమాటలు చెప్పారు. విజయ్ తమనే బెదిరించినట్లు శ్వేత తల్లి శశి సావంత్ తెలిపారు. శ్వేత ఇటీవల భర్త విశ్వనాథ్‌కు విడాకుల నోటీసు కూడా పంపింది. అయితే శుక్రవారం నాడు విజయ్, శ్వేత మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ శ్వేత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థలాన్ని ఉప నగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొన్నారు. సంసారంలో చిచ్చు పెట్టిన విజయ్ పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment