లంచగొండి పీడీఓ అరెస్టు
దొడ్డబళ్లాపురం: రూ.20 వేలు లంచం తీసుకుంటూ మహిళా పీడీఓ లోకాయుక్తకు చిక్కిన సంఘటన నెలమంగల తాలూకా టీ.బేగూరులో జరిగింది. టీ.బేగూరు గ్రామపంచాయతీ పీడీఓ శోభారాణి పట్టుబడ్డ అధికారి. నెలమంగల తాలూకా తొరెకెంపోహళ్లికి చెందిన రమేశ్ అనే వ్యక్తి స్థలాన్ని భార్య పేరున బదిలీ చేయడానికి పంచాయతీలో దరఖాస్తు చేశాడు. అయితే శోభారాణి దళారి ద్వారా రూ.20 వేలు లంచం డిమాండు చేసింది. దీంతో రమేశ్ లోకాయుక్తను ఆశ్రయించాడు. బెంగళూరు రూరల్ లోకాయుక్త ఎస్పీ పవన్ ఆధ్వర్యంలో కాపు కాసి, పీడీఓ లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. విశేషం ఏమిటంటే అవినీతి ఆరోపణలపై శోభారాణి 5సార్లు సస్పెండ్ అయ్యింది. కోర్టుకెళ్లి స్టే తెచ్చి విధుల్లో కొనసాగుతోంది.
దర్శన్‌కు నో ఆపరేషన్
దొడ్డబళ్లాపురం: హత్యకేసులో జైలులో ఉండగా విపరీతమైన వెన్ను నొప్పి అని కోర్టుకు తెలిపి బెయిలు పొందిన ప్రముఖ నటుడు దర్శన్ ఇప్పుడు ఆపరేషన్ మాటెత్తడం లేదు. నొప్పి తగ్గాలంటే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారని కోర్టులో మొరపెట్టుకోవడం తెలిసిందే. మైసూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కొన్ని వారాలపాటు అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకున్న దర్శన్ ఆపరేషన్ లేకుండానే చికిత్స పూర్తి చేసుకున్నాడు. మాత్రలు, ఇంజెక్షన్లు పని చేయడంతో ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం.
కారును ఢీకొన్న బస్సు,
ఐదుగురికి గాయాలు
దొడ్డబళ్లాపురం: కేఎస్ ఆర్‌టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో 5మంది తీవ్ర గాయాలపాలైన సంఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా కౌదళ్లిసంతెకానె గ్రామం వద్ద చోటుచేసుకుంది. కారులో ఉన్న కుమార్ (26), సంజత్ (18), భరత్ (21), అశోక్ (29), మహదేవ ప్రసాద్ (18)గాయపడ్డవారు. వీరంతా కారులో మైసూరు నుంచి మహదేశ్వరకొండకు బయలుదేరారు. దారి మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని కామగెరె హోలిక్రాస్ ఆస్పత్రికి తరలించారు.
గీజర్‌కు రహస్య కెమెరా
యశవంతపుర: నగరంలో రహస్య కెమెరాల గోల అధికమైంది. బాత్‌రూంలో గీజర్ బిగించే చోట రహస్యంగా కెమెరాను అమర్చి మహిళ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తికి దేహశుద్ధి జరిగింది. బెంగళూరు బన్నేరఘట్టలో ఈ సంఘటన చోటుచేసుకొంది. సీకే పాళ్యకు చెందిన మురళి ఓ ఇంటిలో గీజర్‌ని బిగిండానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ రహస్యంగా కెమెరాను అమర్చి ఇంటి మహిళ నగ్నదృశ్యాలను తన మొబైల్ ద్వారా రికార్డుచేసేవాడు. ఏడాదిగా ఈ తతంగం జరుగుతోంది. ఆ వీడియోలను చూపి తన వద్దకు రావాలని మహిళను వేధించసాగాడు. మహిళ స్థానికులకు మొరపెట్టుకోవడంతో పథకం ప్రకారం అతనిని ఇంటికి పిలిపించారు. రాగానే దేహశుద్ధి చేసి పంపారు.
తెలుగు సాహితీవేత్త
తంగిరాల కన్నుమూత
శివాజీనగర: ప్రముఖ కవి, సాహితీవేత్త, బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు పూర్వ శాఖాధిపతి ఆచార్య తంగిరాల సుబ్బారావు (90) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. తిరుపతి వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేసి బెంగళూరు విశ్వ విద్యాలయంలో తెలుగు విభాగంలో బోధకునిగా చేరి ఆ శాఖ అధిపతిగా కూడా వ్యవహరించారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బెంగళూరులో స్వగృహంలో కన్నుమూశారు. ఆచార్య తంగిరాల సుబ్బారావు తెలుగు ప్రజలకు సుపరిచితులు. బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఏర్పాటు, వికాసానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. పలు తెలుగు సంఘాలను, సాంస్కృతికి కార్యక్రమాల నిర్వహణను ప్రోత్సహించారు. అనేక తెలుగు గ్రంథాలను రచించారు. ఆయన సాహితీకృషికి గుర్తింపుగా పలు సంస్థలు పురస్కారాలతో గౌరవించాయి. తెలుగు విజ్ఞాన సమితి, సీపీ బ్రౌన్ సేవా సంస్థలు కూడా అవార్డులతో సన్మానించాయి.
Comments
Please login to add a commentAdd a comment