No Headline
సిలికాన్ సిటీ
బెంగళూరు సిటీ కార్పొరేషన్‌కు ఆస్తి పన్నులే ఊపిరి. ఏటా వేలాది కోట్ల రూపాయలు వసూలవుతోంది. కానీ కొందరు పన్నును చెల్లించడం లేదు, అలాంటివారి ఆస్తులను ఏకంగా వేలం వేసి వసూలు చేసుకోవడానికి సిద్ధమైంది. దీనిని ఆస్తుల యజమానులు ఎలా అడ్డుకుంటారనేది కుతూహలం కలిగిస్తోంది.
శివాజీనగర: ఆస్తి పన్నును బాదుతున్న బీబీఎంపీ.. అది చెల్లించని కట్టడ యజమానులపై కొరడా ఝులిపించనుంది. ఆస్తులను వేలం వేసి సొమ్ము రాబట్టుకోవాలని తీర్మానం చేసినట్లు తెలిసింది. 2020 బీబీఎంపీ చట్ట సవరణ ప్రకారం, ఆస్తి పన్ను చెల్లించనివారి ఆస్తి వేలం వేసేందుకు సిద్ధమైంది. పాలికె చరిత్రలో ఇలాంటి తీర్మానం చేయడం తొలిసారి. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. మహాదేవపుర జోన్ 60 ఆస్తులను ఫిబ్రవరి 13న వేలం వేయాలని ఉన్నతాధికారులు నిర్ధారించారు. మహాదేవపుర జోన్‌లోని 6 ఉప విభాగాల్లో కూడా ఒక్కొక్కటికి 10 ఆస్తులను వేలంపాటకు పెడతారు. దీర్ఘకాలం నుంచి ఆస్తి పన్ను చెల్లించని 60 స్ధిరాస్తుల్ని వేలం వేస్తామని బీబీఎంపీ రెవెన్యూ విభాగపు ప్రత్యేక కమిషనర్ మునీష్ మౌద్గిల్, జోనల్ కమిషనర్ రమేశ్ చెప్పారు. ఆస్తి పన్నులు చెల్లించాలని కట్టడ యజమానులకు అనేకసార్లు నోటీస్, డిమాండ్ నోటీసులు పంపించామని, అయినా స్పందన లేదని తెలిపారు. దీంతో ఆఖరి అస్త్రంగా వేలంపాటను ఎంచుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మొత్తం 608 ఆస్తులపై గురి
అనేక సంవత్సరాలుగా ఆస్తి పన్ను కట్టని 608 కట్టడాలను గుర్తించి వాటిని వేలం వేయాలని బీబీఎంపీ నిర్ణయించింది. వేలం వేసి పన్ను వసూలు చేసుకుంటామని అధికారులు తెలిపారు. ఆ ఆస్తిదారులు సుమారు రూ.390 కోట్ల ఆస్తి పన్ను బాకీ ఉన్నట్టు స్పెషల్ కమిషనర్ మునీష్ మౌద్గిల్ తెలిపారు.
మిగిలిన మొత్తం యజమానికి
ఆస్తి పన్ను వసూలు చేసేందుకు 2020లోనే చట్టం సవరించినా, దానిని అమలు చేయబోతున్నది మాత్రం ఇప్పుడే. వేలం వేయగా వచ్చిన మొత్తంలో ఆస్తి పన్నును తీసుకుని, మిగిలిన డబ్బును ఆస్తి యజమాని బ్యాంక్ ఖాతాలోకి చెల్లించనున్నట్లు తెలిపారు. కేఆర్ పురం, హుడి, హొరమావు, వైట్‌ఫీల్డ్, హెచ్‌ఏఎల్, మారతహళ్లి పరిధిలో మొత్తం 60 ఆస్తిలను బీబీఎంపీ వేలం వేయనున్నది. దీనిపై సదరు కట్టడ యజమానులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పలువురు కోర్టులో సవాలు చేసే యోచనలో ఉన్నారు.
పెండింగ్‌దారులకు
బెంగళూరు పాలికె షాక్
వేలం వేసి బకాయిల
వసూలుకు చర్యలు
పాలికె చరిత్రలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment