నమో శనీశ్వరాయ
● 10 నుంచి పావగడ జాతర
పావగడ: పట్టణంలోని సుప్రసిద్ధ స్థానిక శనీశ్వరస్వామి దేవస్థానం జాతరోత్సవాలు ఈ నెల 10 న త్రయోదశి సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఈ నెల 21 న అష్టమి శుక్రవారం ముగుస్తాయి. ఇందులో భాగంగా ఈ నెల 12 న బుధవారం మాఘ శుద్ధ పున్నమి రోజున ఉదయం 11.50 గంటలకు చెల్లు శుభ మేష లగ్నం శుభ ముహూర్తాన శనీశ్వరుని బ్రహ్మ రథోత్సవం వైభవంగా జరుగుతుంది. 10 న అంకురార్పణ, 11 న మహా చండి యాగం, జ్యేష్టా దేవి శనీశ్వరస్వామి కళ్యాణోత్సవం, 15 న వెండి అడ్డ పల్లకి ఉత్సవం, 21 న ఉయ్యాలోత్సవం, శయనోత్సవాలు జరుగుతాయి. 12 న బుధవారం జరిగే శనీశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవానికి భక్తజనం తరలిరావాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.
ఎమ్మెల్యే దంపతుల పూజలు
కృష్ణరాజపురం: బెంగళూరు మహాదేవపుర నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే మంజుల లింబావలి, మాజీ మంత్రి అరవింద లింబావలి కలిసి మండూరులో ఉన్న శ్రీరాధాకృష్ణ దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. కన్నడ నాడులో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ప్రజలకు మంచి జరగాలని పూజలు చేసినట్లు తెలిపారు. హెచ్.ఎస్.పిల్లప్ప, బీఎన్ నటరాజ్‌లు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్‌లోకి కారు జంప్
మాలూరు: రైలు పట్టాలపై వాహనాలు నిలిచిపోవడం తెలుసు. కానీ ఓ కారు ఏకంగా రైల్వేస్టేషన్ ప్టాట్‌ఫారం మీదకు వచ్చి పల్టీ కొట్టింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి మాలూరు తాలూకాలోని దేవనగుంది రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. రాకేష్ అనే ఓనరు కమ్ డ్రైవరు బాగా తాగి తన కారును వేగంగా నడుపుకొంటూ రైల్వే స్టేషన్‌లోకి దూరాడు. ప్లాట్‌ఫారం నుంచి కారు రైలు పట్టాలపై పడి ఆగింది. అతడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ సమయంలో రైళ్లు రాకపోవడంతో ప్రమాదం ఏదీ జరగలేదు. బంగారుపేట రైల్వే పోలీసులు జేసీబీ సహాయంతో కారును పట్టాలపై నుంచి తొలగించి సీజ్ చేసి రాకేష్‌ను అరెస్టు చేశారు.
చెక్‌బౌన్స్ కేసులో
స్నేహమయి దోషి
మైసూరు: సీఎం సిద్దరామయ్యపై ముడా ఇళ్ల స్థలాల కేసులు వేసి ముప్పుతిప్పలు పెడుతున్న సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ చెక్‌బౌన్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసులో దోషి అని తేల్చిన మైసూరు సివిల్ కోర్టు.. ఫిర్యాదికి రూ.2.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. సొమ్ము చెల్లించకపోతే ఏడాది జైలు శిక్షను అనుభవించాలని జడ్జి తెలిపారు. మైసూరువాసి ఎన్.కుమార్ తన నుంచి అప్పు తీసుకుని చెక్కులు ఇచ్చాడని, అవి బ్యాంకులో వేయగా చెల్లలేదని కృష్ణపై కోర్టులో కేసు దాఖలు చేశారు. జడ్జి హెచ్.టి.అనురాధ కేసును విచారించారు. కృష్ణపై అభియోగాలు రుజువు కావడం ఈ మేరకు తీర్పు వెలువరించారు. కోర్టు ఖర్చుల కింద ప్రభుత్వానికి రూ. 5 వేలు చెల్లించాలని సూచించారు.
ఫైనాన్స్ రుణ భారం..
వ్యాపారి ఆత్మహత్య
కోలారు: మైక్రో ఫైనాన్స్‌లలో రుణం తీసుకుని తీర్చలేక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన కోలారు తాలూకా చిట్నహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. కూరగాయల వ్యాపారం చేసే నాగరాజ్ (35) గత ఐదు సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం కోసం పలు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలలో అప్పులు చేశాడు. వాస్తు ఫైనాన్స్‌లో రూ. 5 లక్షలు, బజాజ్ ఫైనాన్స్‌లో 1.90 లక్షలు, ధర్మస్థలం సంఘంలో 5 లక్షలు, భరత్ ఫైనాన్స్‌లో 1 లక్ష రుణం తీసుకున్నాడు. నాగరాజ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొద్ది నెలులుగా వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేకపోయాడు. ఈ విషయమై ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. అప్పులు కట్టాలని ఫైనాన్స్‌ల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో నాగరాజ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోలారు రూరల్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment