రేపటి నుంచి దుర్గాదేవి జాతర
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలోని వడిగేర తాలూకా గోనాళ్‌లో మహిమాన్విత దుర్గాదేవి జాతర ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆలయం అర్చకుడు మరిస్వామి ఆదివారం మాట్లాడుతూ కలశ పూజ, కృష్ణా నదిలో నుంచి గంగమ్మను తీసుకొచ్చి అభిషేక, కోడి పుంజుల అగ్ని ప్రవేశం, జ్యోతి ప్రకాశం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటకతో పాటు పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుండడంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖగోళ వీక్షణం
తుమకూరు: తుమకూరు నగరంలో ఉన్న విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఖగోళ విజ్ఞాన కార్యక్రమంలో నక్షత్రాలను టెలిస్కోప్‌తో సందర్శించారు. 250 మందికి పైగా ప్రజలు, చిన్నారులు తళతళమెరిసే నక్షత్రాలు, సమీప గ్రహాలు తదితరాలను కుతూహలంగా తిలకించారు. సాధారణంగా కంటికి కనిపించని అనేక ఖగోళ వింతలను చూడడం విశేషం. విజ్ఞాన కేంద్రం సభ్యులు మధుసూదన్‌రావు, శివలింగయ్య, బీకే.రామచంద్ర ఫరీద్ పాల్గొన్నారు.
వందేళ్ల బడి ఉత్సవాలు
గౌరిబిదనూరు: ప్రముఖ విద్యావేత్త నరసింహయ్య జన్మించిన హోసూరులో ఉన్న ప్రభుత్వ ఆదర్శ మాధ్యమ పాఠశాల వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందదాయకమని మంత్రి ఎంసి సుధాకర్ తెలిపారు. ఆదివారం తాలూకాలోని హోసూరులో ప్రభుత్వ మిడిల్ స్కూల్ శతజయంతి ఉత్సవాలు, నరసింహయ్య జన్మ శతామానోత్సవాలను ప్రారంభించి ప్రసంగించారు. రాబోవు 5 సంవత్సరాలలో పాఠశాల అభివృద్ధికి 5 కోట్ల నిధులు అందించాలనే వినతిపై సీఎం సిద్దరామయ్యతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలో సిబ్బంది కొరతను తీర్చడానికి కృషి చేస్తానన్నారు. నరసింహయ్య ఆదర్శాలను నేటి యువత అలవరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ, ఎంపీ సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతిరెడ్డి, శివశంకరరెడ్డి, సాహితీవేత్త హంపా నాగరాజయ్య, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
నక్సలైటు లక్ష్మి లొంగుబాటు
యశవంతపుర: నక్సల్ పోరాటంలో సుదీర్ఘ కాలంగా నిమగ్నమైన తోంబట్టు లక్ష్మీ ఆదివారం ఉడుపి జిల్లా కలెక్టర్ డాక్టర్ విద్యాకుమారి ముందు లొంగిపోయారు. ఆమె వెంట లొంగుబాటు, పునర్‌వసతి సమితి సభ్యుడు శ్రీపాల్ వచ్చారు. గట్టి భద్రత మధ్య ఆమెను కలెక్టర్ ఆఫీసుకు, అటు నుంచి ఎస్పీ ఆఫీసుకు తరలించారు. లక్ష్మీ ఏ కేటగిరీలో ఉన్న నక్సలైటు, తగిన పరిహారం అందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆమెను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్పీ తెలిపారు. లక్ష్మీపై అమాసైబెలు పోలీసుస్టేషన్‌లో మూడు కేసులున్నాయి. 2007లో పోలీసులపై కాల్పులు, దాడి, బెదిరింపులు, గోడలపై నక్సల్ కరపత్రాలు అంటించిన కేసులున్నాయి. లక్ష్మీ మాట్లాడుతూ తమ స్వగ్రామానికి మౌలిక సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. లక్ష్మీ వెంట సోదరుడు, బంధువులు ఉన్నారు. ఈ లొంగుబాట్లతో కన్నడనాట నక్సల్ ఉద్యమం దాదాపు కనుమరుగైందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment