ఆ బండి.. చలానాలు దండి
శివాజీనగర/ కృష్ణరాజపురం: బెంగళూరులో కొందరు వాహనదారులు పదే పదే ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి చివరకు చట్టం చేతిలోకి చిక్కినప్పుడు కళ్లు తేలేస్తుంటారు. అలాంటిదే ఈ విచిత్ర సంఘటన కూడా. ఓ మామూలు స్కూటర్‌పై ఏకంగా 311 ట్రాఫిక్ ఉల్లంఘన చలానాలు నమోదయ్యాయి. వాటి మొత్తం ఎంతో తెలుసా..రూ.1.61 లక్షలు.
సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలానాలను తిరగేస్తుండగా, కళాసిపాళ్యలో ట్రావెల్ ఏజెన్సీని నడిపే స్కూటర్ యజమాని పెరియస్వామి పేరు కనిపించింది. అతని బండి 311 సార్లు అతిక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో పెరియస్వామిని కలిసి విషయం వివరించడంతో అతడు నోరెళ్లబెట్టాడు. తన బండి చలానాల అంత విలువ కూడా లేదని, సగం జరినామా చెల్లిస్తానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు నిరాకరించి ఫుల్ జరిమానా కట్టాలని నోటీసును ఇచ్చి స్కూటర్‌ని పట్టుకెళ్లారు.
2023 ఫిబ్రవరి నుంచి అతని స్కూటర్ నగరంలో వీర విహారం చేసింది. హెల్మెట్ ధరించకపోవటం, సిగ్నల్ జంప్, వన్ వేలో వెళ్లడం, నిషేధిత స్థలాల్లో పార్కింగ్ ఇలాంటి ఉల్లంఘనలు నమోదై ఉన్నాయి. అతనికి పలుసార్లు నోటీస్‌లు పంపినా లెక్కలోకి తీసుకోలేదని తెలిసింది.
311 సార్లు అతిక్రమణలు, రూ.1.61 లక్షల జరిమానా పెండింగ్
Comments
Please login to add a commentAdd a comment