![దేశభక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07bng105a_mr-1738981772-0.jpg.webp?itok=dt3bRiQj)
దేశభక్తి గంగానదిలా పవిత్రమైనది
సాక్షి,బళ్లారి: మనమందరం భారతీయులం, ప్రతి ఒక్కరూ గంగానదిలా పవిత్రంగా ఉండే దేశభక్తిని పెంపొందించుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం హావేరి జిల్లా రాణిబెన్నూరులో కర్ణాటక వైభవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశభక్తి కుల మతాలకు అతీతమైందన్నారు. 5 వేల ఏళ్ల సంస్కృతి మనదని, మన సంస్కృతి వారసత్వాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు తమ వంతు ప్రయత్నం చేయాలన్నారు. ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్తులో భారత్ మూడో స్థానానికి చేరుకుంటుందన్నారు. ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయన్నారు. కశ్మీర్‌లో అభివృద్ధి కనిపిస్తోందన్నారు. రెండు కోట్ల మంది జనం, పర్యాటకులు అక్కడకు వెళ్లి వస్తున్నారన్నారు. దేశాభివృద్ధిలో కశ్మీర్ పాత్ర కూడా ఉందన్నారు. దేశభక్తి భావన ప్రతి ఒక్కరిలో పెంపొందించుకోవాలన్నారు.
పదేళ్ల క్రితానికీ నేటికీ దేశంలో ఎంతో మార్పు
పదేళ్ల క్రితం భారతదేశం ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ప్రపంచంలోనే భారత్ శక్తివంతంగా ఎదిగిందని గుర్తు చేశారు. భారతదేశంలో పెద్ద యజ్ఞం జరుగుతోందని, వికసిత భారత్ తమ చిరకాల లక్ష్యం అన్నారు. 2040 నాటికి భారతదేశం వికసిత భారత్‌గా రూపొందుతుందన్నారు. దేశభక్తి వ్యతిరేకత సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాటిని పట్టించుకోకూడదన్నారు. ప్రపంచంలోనే భారత దేశంలోని కళలు, సంస్కృతి గురించి ఎంతో గొప్పగా చర్చిస్తున్నారన్నారు. కర్ణాటక సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా మారిందన్నారు. విజయనగర రాజుల కాలం నాటి పాలన, బసవేశ్వరుడు, అక్కమహాదేవి, భరతనాట్యం, యక్షగానం తదితర వాటిలో కర్ణాటక ప్రసిద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
మన సంస్కృతి వారసత్వాలను
కాపాడుకోవాలి
రాణిబెన్నూరులో ఉపరాష్ట్రపతి
జగదీప్ ధన్‌కర్
![దేశభక్తి గంగానదిలా పవిత్రమైనది 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07blr44-600670_mr-1738981772-1.jpg)
దేశభక్తి గంగానదిలా పవిత్రమైనది
Comments
Please login to add a commentAdd a comment