‘మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం’ | Sakshi
Sakshi News home page

‘మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం’

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

● ఎంపీగా నామను గెలిపిస్తేనే అది సాధ్యం ● ప్రచార సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు

ఖమ్మం రూరల్‌/తిరుమలాయపాలెం: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలిపించాలని పలువురు పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడెం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో జరిగిన ప్రచార సమావేశాల్లో అభ్యర్థి నామతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతులు, సామాన్య ప్రజల కష్టాలు కళ్లెదుటే కనబడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా నామ గెలుపు తప్పనిసరని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు తప్పు చేశామని భావిస్తున్న ప్రజలకు బీఆర్‌ఎస్‌ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను వివరిస్తూ నామ గెలుపునకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ పథకాలను తొలగించడమే కాక హామీలను నెరవేర్చడం లేదంటూ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా పాట రూపంలో వివరించారు. అలాగే, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ బి.ఉమ, నాయకులు తాళ్లూరి జీవన్‌కుమార్‌, బెల్లం వేణు, బాషబోయిన వీరన్న, గుడిబోయిన దర్గయ్య, లక్ష్మణ్‌, వెంకటేశ్వర్లు, ఏ.వరప్రసాద్‌, దేవరం దేవేందర్‌రెడ్డి, మాలతి, చావా వేణు, ఆలస్యం నాగేశ్వరరావు, రవి, చామకూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం లీగల్‌: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులను కలిసి తనను గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ నాయకులు బిచ్చాల తిరుమలరావు, కొత్తా వెంకటేశ్వరరావు, మేకల సుగుణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement