మున్నేటిలో ఫ్యాక్టరీల వ్యర్థాలు | - | Sakshi
Sakshi News home page

మున్నేటిలో ఫ్యాక్టరీల వ్యర్థాలు

Published Sat, Oct 5 2024 12:10 AM | Last Updated on Sat, Oct 5 2024 12:10 AM

మున్న

● హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి కలుపుతున్న వైనం ● ట్యాంకర్లను గుర్తించి అడ్డుకున్న స్థానికులు ● తాగునీరు కలుషితం అవుతోందని ఆందోళన

ఖమ్మంరూరల్‌: ఖమ్మం నగరంలోని ధంసలాపురం, ప్రకాష్‌నగర్‌, త్రీటౌన్‌లోని పలు ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసే మున్నేటిలో ఫ్యాక్టరీల వ్యర్థాలను కలుపుతున్నారు. ఖమ్మంరూరల్‌ మండలంలోని వెంకటగిరి, కోటనారాయణపురం, గుదిమళ్ల ప్రాంతాల్లో విష వ్యర్థాలు వదిలేస్తుండగా తాగునీరు కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లోని వివిధ ఫ్యాక్టరీల నుండి వెలువడిన విష వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి వెంకటగిరి సమీపాన మున్నేటిలో వదులుతున్నట్లు సమాచారం. ఆగస్టు 15వ తేదీన హైదరాబాద్‌ నుండి ట్యాంకర్‌తో వచ్చిన పలువురు వ్యర్థాలు వదిలి వెళ్తుండగా వెంకటగగిరి, గుదిమళ్ల గ్రామస్తులు పట్టుకున్నారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తూతూమంత్రంగా విచారించి వదిలేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

తెల్లవారుజామునే...

గతంలో పలుమార్లు ట్యాంకర్లను స్థానికులు అడ్డుకున్నా యజమానులు తీరు మార్చుకోకపోగా పోలీసులు సైతం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ఫ్యాక్టరీ నుండి ట్యాంకర్‌లో విష వ్యర్థాలను తీసుకొచ్చి వెంకటగిరి వద్ద మున్నేటిలో కలుపుతుండగా గ్రామస్తులు గుర్తించారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకుని ట్యాంకర్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా గ్రామస్తులు మాత్రం కలెక్టరేట్‌కు తరలించాలని పట్టుబట్టారు. గతంలోనూ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి వదిలేశారని ఆరోపించడంతో పోలీసులు నచ్చచెప్పి ట్యాంకర్‌ను రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా, మున్నేటిలో వదిలిన విష వ్యర్థాలు నీటిలో కలిసి చింతకాని, బోనకల్‌, మధిరతో పాటు ఆంధ్రా ప్రాంతం వరకు వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా తాగునీరు కలుషితం అవుతుండగా పశువులు, పంటపొలాలకు ముప్పు ఉంటుందని చెబుతున్నారు.

ఇద్దరిపై కేసు నమోదు

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గుదిమళ్ల వద్ద మున్నేటిలో ఫ్యాక్టరీల నుంచి వెలువడే విష వ్యర్ధ్థాలను కలిపిన ఘటనపై శుక్రవారం ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని ఓ ఫ్యాక్టరీ యజమాని మధుసూదన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌కు చెందిన డ్రైవర్‌ కృష్ణ ట్యాంకర్‌తో వచ్చి మున్నేటిలో వ్యర్థాలు వదులుతుండగా చేపలు పట్టడంలో నిమగ్నమైన గుదిమళ్లకు చెందిన కందరబోయిన శ్రీనివాస్‌, గుమ్మం గోపయ్య గుర్తించారు. వీరు ఇచ్చిన సమాచారంతో గ్రామస్తులు ధరావత్‌ నాగేశ్వరరావు, తదితరులు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మధుసూదన్‌రెడ్డి, కృష్ణపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మున్నేటిలో ఫ్యాక్టరీల వ్యర్థాలు1
1/2

మున్నేటిలో ఫ్యాక్టరీల వ్యర్థాలు

మున్నేటిలో ఫ్యాక్టరీల వ్యర్థాలు2
2/2

మున్నేటిలో ఫ్యాక్టరీల వ్యర్థాలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement