మళ్లీ రాజుకుంటున్న పోడు వివాదం
● తేలని రెవెన్యూ, అటవీశాఖల సరిహద్దు సమస్య ● పట్టాలు ఉన్నా భూములు కోల్పోతున్న గిరిజనులు ● అటవీశాఖ ఫిర్యాదులపై వెనువెంటనే కేసులు ● పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
ఇల్లెందురూరల్: పోడు భూములు తరతరాలుగా గిరిజన రైతులకు ఆదెరువుగా నిలుస్తున్నా ఎలాంటి హక్కులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం నాటి సీఎం కేసీఆర్ మరోమారు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. అయినప్పటికీ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లబించలేదు. అటవీ, రెవెన్యూ భూములకు సంబంధించి స్పష్టమైన హద్దులు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతుండగా, పోడు ఘటనలపై తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.
సమన్వయలేమి.. ఏళ్ల తర్వాత స్వాధీనం
అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల పట్టుదలతో భూముల హద్దులు తేలడం లేదు. ఈ కారణంగా భూవివాదాలు ఎంతకూ తెగకపోగా అర్హులైన రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఇప్పటివరకు పలు దఫాలుగా సంయుక్త సర్వే చేపట్టినా హద్దులు మాత్రం తేల్చలేకపోయారు. రెవెన్యూ అధికారుల వద్ద గ్రామ విస్తీర్ణంతోపాటు అటవీ, రెవెన్యూ భూముల హద్దులు నిర్ణయించే నక్షాలు లేకపోగా, అటవీశాఖ అధికారులు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కలిగిన గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను తమవిగా చెబుతూ స్వాధీనం చేసుకుంటున్నారు. ఫలితంగా పలు గ్రామాల్లో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇల్లెందు మండలంలో రెండు దఫాలుగా పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. అయితే, తొలిదఫా హక్కుపత్రాలు అందుకున్న రైతుల నుంచి అటవీశాఖ అధికారులు ఆలస్యంగా ఆ భూములు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో రెండో దఫా పట్టాలు పంపిణీ చేసిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ పోడు భూముల స్వాధీనానికి యత్నిస్తుండడం గమనార్హం.
ఫిర్యాదుల వెల్లువ
అధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకుంటుండడంతో పలు గ్రామాల్లో గిరిజన రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం గ్రామపంచాయతీలో భూక్యా సరోజ కుటుంబానికి ముప్‌పై ఏళ్ల క్రితం ప్రభుత్వం రెవెన్యూ భూమి నాలుగెకరాలకు పట్టా అందజేసింది. అదే సమయాన పక్కనే అటవీభూమి 5.23 ఎకరాల్లో పోడు సాగు చేస్తుండగా ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా మంజూరైంది. ఈ భూమికి రైతుబందు నిధులు కూడా అందాయి. కానీ అటవీశాఖ అధికారులు పట్టా ఉన్న రెవెన్యూ భూమినే అటవీ శాఖదని చెబుతూ స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మొండితోగుకు చెందిన తాటి పోశాలు భార్య భద్రమ్మ పేరిట రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్‌పుస్తకం జారీ చేశారు. ఆ భూమి అటవీ పరిధిలో ఉందని చెబుతూ ఐదెకకరాల భూమిని మూడేళ్ల క్రితం అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. ఇలా మట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 479, సీఎస్పీ బస్తీ పరిధి సర్వే నంబర్ 549, రాఘబోయినగూడెం గ్రామపంచాయతీ పరిధి సర్వే నంబర్ 131 పరిధిలో పోడు సమస్య అపరిష్కృతంగానే ఉంది. స్థానికంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేక నేరుగా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేస్తున్నారు.
సమగ్ర విచారణ లేకుండానే...
ఏదైనా భూసమస్య ఉత్పన్నమైతే రెవెన్యూ, అటవీశాఖల అధికారుల నుంచి లిఖితప్వూకంగా వివరణ తీసుకున్నాకే పోలీసులు అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. కానీ ఒడ్డుగూడెం గ్రామపంచాయతీ నెహ్రూనగర్‌కు చెందిన గిరిజన రైతు భూక్యా సరోజ కు సంబంధించిన వివాదంలో అటవీశాఖ అధికారు ల ఫిర్యాదుపై పోలీసులు విచారణ లేకుండానే కేసు నమోదుకు సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది.
భూముల నుంచి వెళ్లగొడుతున్నారు
ముప్పై ఏళ్ల క్రితం నాలుగెకరాలకు ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. పక్కనే అటవీ ప్రాంతం ఉండడంతో అప్పట్లోనే పోడు నరికి సాగు చేశాం. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కూడా అందాయి. కానీ ఇప్కుపడు అటవీశాఖ అధికారులు ఆ భూములు వారివని వెళ్లగొడుతున్నారు.
– భూక్యా సరోజ, నెహ్రూనగర్, ఇల్లెందు మండలం
అటవీ భూములనే స్వాధీనం చేసుకున్నాం
మండలంలో అటవీశాఖ పరిధిలో భూఆక్రమణలను అడ్డుకుంటున్నాం. వివాదాస్పద భూములకు జారీ చేసిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలపై ఉన్నతాధికారులకు నివేదించి విచారణ చేస్తాం. నెహ్రూనగర్‌లో అటవీ భూమి ఆక్రమణకు ప్రయత్నం జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం.
– ప్రసాద్, ఎఫ్‌ఆర్‌ఓ, ఇల్లెందు మండలం
Comments
Please login to add a commentAdd a comment