పౌష్టికాహారం ప్రతీ పౌరుడి హక్కు
● కోడిగుడ్ల కాంట్రాక్టర్‌కు మెమో జారీ చేయండి ● రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఆనంద్, జ్యోతి
ఖమ్మం సహకారనగర్: పౌరులంతా పౌష్టికాహారం అందుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, భూక్యా జ్యోతి తెలిపారు. ఈ మేరకు అమల్లో ఉన్న ఆహార భద్రత చట్టాన్ని అధికారులు పక్కాగా అమలు చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో ఆహార భద్రత చట్టం అమలుపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి వారు అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అమలు, పాఠశాలలో ఏర్పా టు చేస్తున్న న్యూట్రీ గార్డెన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. అనంతరం సభ్యులు ఆనంద్, జ్యోతి మాట్లాడుతూ విద్యార్థుల శారీరక అభివృద్ధికి అవసరమైన పోషకాలు అందేలా భోజన మెనూ రూపొందించినందున అమలుచేయాలన్నారు. అయితే, వెజిటబుల్ బిర్యానీ, కోడిగుడ్ల సరఫరాలో లోపాలు గుర్తించామని తెలిపారు. ఈ మేరకు గురుకులాలకు చిన్న సైజ్ కోడిగుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్ మెమో జారీ చేయడమేకాక తీసుకున్న చర్యలపై 15రోజుల్లో నివేదిక అందించాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటుచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీసీఓ చందన్‌కుమార్, జిల్లా మేనేజర్ జి.శ్రీలత, వివిధ సంక్షేమ శాఖల అధికారులు కె.సత్యనారాయణ, రాంగోపాల్‌రెడ్డి, జ్యోతి, విజయలక్ష్మి, డీఈఓ సోమశేఖరశర్మ, డీఎంహెచ్‌ఓ కళావతి బాయి, రేషన్‌డీలర్ల సంఘం నాయకులు వెంకన్న, జానీమియా తదితరులు పాల్గొన్నారు.
పెద్దాస్పత్రిలో తనిఖీ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ తనిఖీ చేశారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని విభాగాలను పరిశీలించి గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహరంపై ఆరా తీశారు. డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్, ఆర్‌ఎంఓ బి.రాంబాబు, పీడియాట్రిక్ హెచ్‌ఓడీ బాబు రత్నాకర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సైదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment