పచ్చని అందాల నడుమ ఆధ్యాత్మిక శోభ
ఇల్లెందురూరల్: అడుగడుగునా రకరకాల మొక్కలతో అల్లుకుపోయిన పచ్చని అందాల నడుమ హజ్రత్ నాగుల్‌మీరా దర్గా ప్రాంగణం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. దర్గా నిర్వాహకులు పచ్చని మొక్కలతో ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన తీరు భక్తులను కట్టిపడేస్తుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యాన కథనం.
అటవీ ప్రాంతంలో..
ఇల్లెందు మండలం సత్యనారాయణపురం శివారు నుంచి సుమారు మూడు కి.మీ. దూరాన దట్టమైన అటవీ ప్రాంతంలో హజ్రత్ నాగుల్‌మీరా దర్గాను నిర్మించారు. సత్యనారాయణపురం నుంచి దర్గా వరకు మహనీయులు బోధించిన నీతివాక్యాలతో హోర్డింగ్‌లు మనిషిలో మార్పునకు పునాదులు వేసేలా దర్శనమిస్తాయి. రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు.. మధ్యలో చిన్నపాటి గుట్టలు.. అక్కడక్కడా చెరువులు ఆకట్టుకుంటాయి. దర్గా వద్దకు చేరుకోగానే తమను తాము మైమరిచిపోయేలా పచ్చందాల శోభ అహ్లాదాన్ని పంచుతుంది.
మతసామరస్యానికి ప్రతీకగా..
తరాలు మారినా సర్వమతాల సంస్కృతీ ప్రతీకగా వెలుగొందుతోంది నాగుల్‌మీరా దర్గా మౌలా చాన్ చిల్లా. ఆధ్యాత్మిక చింతన, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాను హిందూ, ముస్లిం, క్రైస్తవులు దర్శించుకుని ప్రార్థనలు చేస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దర్గా ప్రాంగణంలో ఏటా సీతారాముల కల్యాణం, శ్రీరాముని మహా పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అంతేకాక రావణుడి చెర నుంచి సీతమ్మను విడిపించేందుకు శ్రీరాముడు సముద్రంపై ప్రయాణించేలా వానర సైన్యం నిర్మించిన వంతెనకు ఉపయోగించిన నీటిపై తేలియాడే రాళ్లలో ఒకటిగా చెప్పే రామసేతు రాయిని సైతం ఇక్కడ భద్రపర్చారు. ఇలా ఆధ్యాత్మిక సంపదకు, భక్తిశ్రద్ధలకు నిలయమైన ఈ దర్గాను దర్శించుకొని ప్రార్థన చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తులు నమ్ముతారు.
జాతీయ సమైక్యతను
చాటుతున్న ప్రాంగణం
ఆకట్టుకుంటున్న నాగుల్‌మీరా క్షేత్రం
ఈ నెల 30 నుంచి మొదలుకానున్న ఉర్సు ఉత్సవాలు
పెంపుడు జంతువులు.. పచ్చని మొక్కలు
హజ్రత్ నాగుల్‌మీరా మౌలా చాన్ దర్గా ప్రాంగణంలో అరుదైన పెంపుడు జంతువులు, పూల మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎటు చూసినా పచ్చందాల శోభ ఆకట్టుకుంటుంది. దర్గా ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లతో వీటిని పోషిస్తున్నారు. దేశవిదేశాల నుంచి సేకరించిన పూల మొక్కలు, ఆస్ట్రియా, టర్కీ తదితర దేశాల నుంచి తెచ్చిన పక్షులు, కోళ్లు, పావురాలు, కుందేళ్లు, బాతులు, ఈము పక్షులు, కూరగాయల తోటలు, పూల తోటలు, పండ్ల తోటలను ఇక్కడ చూడొచ్చు. దర్గాలో పూజల అనంతరం భక్తులు వీటిని సందర్శించి కాసేపు విడిది చేస్తారు.
ప్రశాంతత కోసం..
నిత్యం వ్యాపార పనులతో బిజీబిజీగా గడిపే మేం ప్రతి శుక్రవారం నాగుల్‌మీరా దర్గాను దర్శించుకుంటాం. తద్వారా మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడ ఆధ్యాత్మిక ఆనందం లభించడమే కాక ప్రకృతి ఒడికి చేరుకున్నామన్న ఆహ్లాదం కలుగుతుంది.
–కామిశెట్టి దుర్గారావు, ఇల్లెందు
విహారయాత్రకు వెళ్లినట్లుగా..
నాగుల్‌మీరా ప్రాంగణాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తుంటాం. భక్తిభావంతో పాటు ఇక్కడ అల్లుకుపోయిన పచ్చందాలు, ఆకట్టుకునే పక్షులు మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి. ఇక్కడకు వస్తే విహారయాత్రకు వచ్చామా అన్న అనుభూతి వస్తుంది.
–చింత విజయలక్ష్మి, సుదిమళ్ల, ఇల్లెందు మండలం
Comments
Please login to add a commentAdd a comment