పురాతన రాకాసి గూళ్లు!
అశ్వాపురం: దట్టమైన అటవీ ప్రాంతం కలిగిన ఏజెన్సీలోని మారుమూల గ్రామంలో పురాతనమైన రాకాసి గూళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులగూడెం పంచాయతీ పరిధి వేములూరులో వందల సంఖ్యలో రాకాసి గూళ్లు కనిపిస్తాయి. అశ్వాపురం, మణుగూరు మండలాల సరిహద్దుగా ఉన్న రేగులగండికి సమీపంలో కొన్ని వేల ఏళ్ల కిందటివిగా భావిస్తున్న సుమారు 1,500 రాకాసి గూళ్ల నిర్మాణాలు ఉన్నాయి.
తలదాచుకునేందుకా?
తొమ్మిది అడుగుల ఎత్తుతో సమానంగా చెక్కినట్లుగా ఉండే రాళ్లతో ఈ రాకాసి గూళ్లను పేర్చారు. రాతి యుగంలో మానవులు తలదాచుకునేందుకు ఈ నిర్మాణాలు చేపట్టి ఉంటారని తెలుస్తోంది. వేల ఏళ్ల కిందటివిగా భావిస్తున్న ఈ గూళ్లు నేటికి చెక్కు చెదరకుండా ఉండడం వివేషం. ఆదివాసీ గిరిజనులు అప్పటి మానవుల సమాధులుగా చెబుతారు. ఈ నిర్మాణాల వివరాలు తెలిసిన ఇతర ప్రాంతాల వారు చూసేందుకు వస్తుంటారు. గతంలో ఈ నిర్మాణాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించగా.. ప్రాచీన రాతి నిర్మాణాలను సంరక్షిస్తూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. కానీ, ఆ తర్వాత అడుగు ముందుకుపడలేదు. అంతేకాక రాకాసి గూళ్ల సంరక్షణకు సైతం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో పలువురు వీటి కింద గుప్తనిధులు ఉంటాయనే అపోహతో తవ్వుతున్నారు. ఇకనైనా యంత్రాంగం స్పందించి వేళ ఏళ్ల చరిత్ర కలిగిన రాకాసి గూళ్లను కాపాడడంపై దృష్టి సారించాలని వేములూరు గ్రామస్తులు కోరుతున్నారు.
సంరక్షణ.. అభివృద్ధిపై దృష్టి సారిస్తే..
ఎన్నో ఏళ్ల కిందటి నుంచి వేములూరులో వందల సంఖ్యలో రాకాసి గూళ్లు ఉండడాన్ని గ్రామస్తులు ప్రత్యేకంగా చెబుతారు. ఈ నేపథ్యాన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయంలో ఏళ్లుగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోకపోగా.. కనీసం నిర్మాణాలను రక్షించడంపైనా శ్రద్ధ పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా, కూనవరం, మణుగూరు, ఖమ్మంతోగు, బుగ్గ, గుండాల, ఆళ్లపల్లి, మర్కోడు, పాల్వంచ మండలం ఉలవనూరు, పాల్వంచ, అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామాల నుంచి వేములూరుకు గిరిజనులు కాలినడకన వచ్చి వస్తుమార్పిడి చేసుకునేవారని చెబుతారు. ఇలా వేములూరుకు చరిత్ర ఉన్నా కనీస రహదారి సౌకర్యం మాత్రం లేదు. ఇప్పటికై నా కలెక్టర్, అఽధికారులు స్పందించి రాకాసి గూళ్ల నిర్మాణాలపై పరిశోధనలు చేయించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వేములూరు వద్ద దట్టమైన
అటవీ ప్రాంతంలో రాతి నిర్మాణాలు
ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరని వైనం
పర్యాటకంగా అభివృద్ధి
చేయాలంటున్న గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment