ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
ఖమ్మంసహకారనగర్: గత రెండున్నర ఏళ్లుగా మానసిక వేదనకు గురవుతున్న రాష్ట్రంలోని 5,139 మంది వీఆర్వోలను మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం చరిత్రలో నిలిచిపోతుందని వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్‌రావు అన్నారు. ఖమ్మంలోని టీటీడీసీ భవనంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలాది మంది వీఆర్వోలు, వారి కుటుంబాలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. గత ప్రభుత్వం వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి విడదీయడమే కాకుండా వ్యవస్థను రద్దు చేసిందన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మిగతా మంత్రులు, ఉన్నతాధికారుల చొరవతో తిరిగి రెవెన్యూ శాఖలోకి తమను తీసుకుంటున్నారని తెలిపారు. అయితే, గత సర్వీస్, పదోన్నతులపైనా నిర్ణయం వెలువరించాలని ఉపేందర్‌రావు కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం బాధ్యులు చీమల నాగేంద్రబాబు, బంక కృష్ణ, షేక్ జానీమియా, వజ్జ రామారావు, చర్ల శ్రీనివాస్, ధరావత్ భాస్కర్, కిషోర్, నెల్లూరు లవన్ కుమార్, బంక భాస్కర్, శ్రీవాణి, మల్లీశ్వరి, వాంకుడోత్ వెంకన్న, ధన్నూరి బాలరాజు, చిట్టిమళ్ల నాగేశ్వరరావు, షేక్ నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment