సంతాన ప్రాప్తిరస్తు !
నిరుపేదలకు ప్రయోజనం
పెళ్లి అయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవటంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి, పిల్లలు కలగాలనే ఆశతో చాలా మంది దంపతులు ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఆయా సెంటర్లకు వెళ్లిన వారికి నిర్వాహకులు మాయమాటలు చెబుతూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. చికిత్స పేరుతో నెలలు తరబడి తిప్పుతూ ఆర్థికంగా నష్టపరుస్తున్నారు. సాధారణంగా సంతాన లేమితో బాధపడే దంపతులకు ఐయూఐ, ఐవీఎఫ్, సరోగసీ విధానంలో పిల్లలు కలిగేలా చేస్తారు. అయితే ఈ చికిత్స ఇప్పటివరకు ప్రైవేట్‌లోనే అందుబాటులో ఉండడంతో పిల్లలు లేని నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఆయా సెంటర్ల ఉచ్చులో పడుతుండగా, మరికొందరు డబ్బు పెట్టలేని స్థితిలో ఆవేదనతో కాలం గడుపుతున్నారు. ఫలితంగా కుటుంబీకులు, బంధువులే కాక సమాజం నుంచి సూటిపోటి మాటలతో మనోవేదనకు గురవుతునారు. ప్రభుత్వపరంగా సంతాన సాఫల్య కేంద్రం అందుబాటులోకి వస్తే పిల్లలు లేని నిరుపేదలకు మేలు జరగనుంది. ఉచితంగా నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా ప్రైవేట్‌కు వెళ్లి నష్టపోవాల్సిన పరిస్థితి ఉండదని చెబుతున్నారు.
ఖమ్మం వైద్యవిభాగం: సంతానం కోసం పరితపించే నిరుపేదలకు ఊరట లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంతాన లేమితో బాధపడుతున్న దంపతులు ప్రైవేట్ సంతాన సాఫల్య కేంద్రాలకు వెళితే రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంత స్థోమత లేని వారి కోసం జిల్లా కేంద్రంలో సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ కేంద్రం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రకటించగా.. నిధులు విడుదల చేసి కేంద్రాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఐదింటికి అనుమతి.. కానీ 30 సెంటర్లు
జిల్లాలో ప్రైవేట్ సంతాన సాఫల్య కేంద్రాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు కేంద్రాలు వెలుస్తున్నాయి. పిల్లలు లేని తల్లిదండ్రులే లక్ష్యంగా ఫెర్టిలిటీ సెంటర్, టెస్టుట్యూబ్ బేబీ సెంటర్ వంటి పేర్లు పెట్టుకుని దందాకు తెరలేపుతున్నారు. తక్కువ ఖర్చుతోనే సంతాన యోగ్యం కలిగిస్తామని నమ్మబలుకుతూ అమాయక దంపతుల నుంచి రూ.లక్షల్లో దండుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా నిబంధనలు అతిక్రమించి సుమారు 30 వరకు సెంటర్లు నడుస్తున్నట్లు సమాచారం. అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతి కేవలం ఐదింటికే ఉండడం గమనార్హం. వీటి వలలో పడకుండా ప్రభుత్వ పరంగా కేంద్రాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటుకు ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది.
పెరుగుతున్న సంతానలేమి సమస్య..
వివిధ శాఖల అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో 26 శాతం మంది సంతాన లేమి సమస్య ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అదునుగా జిల్లాలో అనుమతి లేకుండా అనేక ఫెర్టిలిటీ సెంటర్లు నడుస్తున్నాయి. చాలా సెంటర్లు సిట్టింగ్‌ల పేరుతో ఏళ్లకేళ్లు చికిత్స అందిస్తూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. సంతానం కలగని దంపతులకు తమ ఆస్పత్రిలో ఐవీఎఫ్, ఐయూఐ సేవల పేరుతో నిర్వాహకులు బురిడీ కొట్టిస్తున్నారు. చాలామంది దంపతులు పిల్లలు పుడతారనే ఆశతో ఆయా సెంటర్లను ఆశ్రయిస్తుండగా.. అర్హత లేకుండా నడిపే కొన్ని సెంటర్లలో పిల్లలు పుట్టకపోగా దంపతులు కొత్త అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జిల్లా పెద్దాస్పత్రిలో
సంతాన సాఫల్య కేంద్రం
ఇప్పటికే ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్
త్వరలోనే ఏర్పాటుకు కసరత్తు
పిల్లలు లేని నిరుపేదలకు తీరనున్న కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment