ఆఖరి దశలో సర్వే..
కొలిక్కి వచ్చిన ‘ఇందిరమ్మ’ దరఖాస్తుల పరిశీలన
● ఖమ్మం జిల్లాలో 83.96శాతం, భద్రాద్రి జిల్లాలో 70శాతం పూర్తి ● అధికారులతో ఐదు శాతం మేర ‘సూపర్ చెకింగ్’ ● త్వరలోనే తేలనున్న లబ్ధిదారుల సంఖ్య
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన ఉమ్మడి జిల్లాలో ఓ కొలిక్కి వచ్చింది. వారం రోజుల్లో దరఖాస్తుల సర్వే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 83.96 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 శాతం మేర సర్వే పూర్తికాగా, ఎంపీడీఓలు సూపర్ చెకింగ్ చేస్తున్నారు. ఒక్కో మండలంలో కనీసం ఐదు శాతం దరఖాస్తులను వీరు పరిశీలించి అర్హులను నిర్ధారించనున్నారు.
గతనెల 9నుంచి..
ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే గత నెల 9నుంచి ప్రారంభమైంది. కొన్నాళ్ల క్రితం నిర్వహించిన ప్రజాపాలన సభల్లో ఖమ్మం జిల్లాలో ఇళ్ల కోసం 3,57,869 దరఖాస్తులు అందగా ఇప్పటివరకు 3,06,131 ఇళ్లలో పరిశీలన పూర్తయింది. ఇందులో 3,00,453 దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,73,493 దరఖాస్తులకు గాను 1,90,181 ఇళ్ల సర్వే పూర్తవగా, మరో 83,312 దరఖాస్తులు మిగిలి ఉన్నాయి.
భద్రాద్రిలో కాస్త నెమ్మదిగా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సర్వే కొంత మేర వేగంగా సాగింది. పాలేరు నియోజకవర్గంలో 87.59 శాతం, మధిర నియోజకవర్గంలో 87.10 శాతం, వైరాలో 85.15 శాతం, సత్తుపల్లిలో 84.20 శాతం పూర్తయింది. ఇక ఖమ్మం నియోజకవర్గంలో 75.73 శాతం దరఖాస్తుల పరిశీలన జరగగా, ఇది ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 72.26 శాతంగానే నమోదైంది. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం 70 శాతం దరఖాస్తుల పరిశీలనే పూర్తవడం గమనార్హం. ఇక్కడ ఇల్లెందు నియోజకవర్గంలో మాత్రం అత్యధికంగా 76 శాతంగా నమోదైంది.
నూరు శాతం కష్టమే..
దరఖాస్తుల ఆధారంగా సర్వే వంద శాతం పూర్తి చేయడం కష్టమేనని ఉద్యోగులు భావిస్తున్నారు. కొన్ని ఇళ్లను వదిలేయడంపై అధికారులు వివరణ కోరగా సిబ్బంది చెప్పిన సమాధానాలతో ఇలా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కొందరు ఒక చోట దరఖాస్తు చేసుకోగా.. వారి స్థలం మరో గ్రామంలో ఉండడం, కొందరు ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు ఇచ్చిన చిరునామాలో ఎవరూ లేకపోవడం, మరికొందరు కన్నుమూయడం, ఇంకొందరు ఫోన్లు తీయడం లేదని సమాచారం. అంతేకాక పలువురు సర్వేకు వచ్చిన సిబ్బందితో తమకు ఇల్లు అవసరం లేదని చెబుతుండగా, చాలా మంది ఇతర గ్రామాల్లో నివసిస్తూ సొంత గ్రామంలో ఇల్లు కావాలని కోరుతున్నట్లు తెలిసింది. ఇలాంటి దరఖాస్తులన్నీ పోను మిగిలిన వాటినే అప్‌లోడ్ చేయనున్నారు.
మా పేర్లు ఏవీ?
ఉమ్మడి జిల్లాలో ప్రజాపాలన సభల సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న కొందరు తమ వద్దకు సర్వే సిబ్బంది ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారు. కానీ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయాన ఆపరేటర్ల పొరపాట్లతో యాప్‌లో పేర్లు కానరావడం లేదు. ఫలితంగా ఏదైనా వీధికి వెళ్లినప్పుడు పేర్లు లేనివారు సిబ్బందిని ఆరా తీస్తున్నారు. కానీ యాప్‌లో పేర్లు రాలేదని చెబుతుండగా వీరంతా కార్పొరేషన్, మున్సిపాలిటీలు, మండల కార్యాలయాలకు వెళ్లి తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందులో పలువురు మరోమారు దరఖాస్తులు ఇస్తున్నారు.
నాలుగైదు రోజుల్లో పూర్తవుతుంది..
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ఆధారంగా సర్వే నాలుగైదు రోజుల్లో పూర్తవుతుంది. దరఖాస్తుదారులు ఒకచోట, స్థలం ఒక చోట ఉండడం, కొందరి చిరునామాలు దొరకకపోవడం, మరికొందరు ఇల్లు వద్దని చెప్పడం వంటి కారణాలతో కొన్ని దరఖాస్తులు మిగిలిపోతున్నాయి. ఇలాంటివి 14నుంచి 15శాతం మేర ఉండగా దరఖాస్తులపై కారణాలు రాయాలని సిబ్బందికి సూచించాం. సర్వే పూర్తయ్యాక గ్రామపంచాయతీల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కమిషనర్ ఐదు శాతం మేర సూపర్ చెకింగ్ చేస్తే లబ్ధిదారుల సంఖ్య తేలనుంది.
– బి.శ్రీనివాస్, పీడీ, గృహనిర్మాణశాఖ, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment