పారదర్శకంగా ఓటరు జాబితా..
● పరిశీలకురాలు బాలమాయాదేవి ● మూడు జిల్లాల అధికారులతో సమీక్ష
ఖమ్మంసహకారనగర్: అర్హులైన ప్రతీఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ పారదర్శకంగా జాబితా ఉండాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి.బాలమాయాదేవి సూచించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం ఆమె ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా తుది ఓటర్ల జాబితా, మహిళలు, పురుషుల నిష్పత్తి, గుర్తింపు కార్డుల పంపిణీ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఓటర్ల తుది జాబితా విజయవంతంగా ప్రచురించడంపై అధికారులను అభినందించారు. అయితే, ఇప్పుడే కాక ఇతర సమయాల్లో దరఖాస్తులు స్వీకరించి అర్హులకు ఓటు హక్కు కల్పించాలని, చనిపోయిన పేర్లు తొలగించడంపై దృష్టి సారించాలని సూచించారు. అంతేకాక ఓటర్ల తుది జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని తెలిపారు. అనంతరం ఖమ్మం అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ 98.15 శాతం మేర పూర్తయిందన్నారు. అలాగే, చనిపోయినవారి పేర్ల తొలగింపునకు ప్రత్యేక సర్వే చేశామని, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ద్వారా అందే సమాచారంతో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 12,30,572 మంది ఓటర్లతో తుది ఓటరు జాబితా రూపొందించామని తెలిపారు.
డైట్ అమలుపై ప్రత్యేక దృష్టి
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాలలో విద్యార్థులకు కామన్ డైట్ అమలయ్యేలా అధికారులు పరిశీలించాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ కూడా అయిన బాల మాయాదేవి సూచించారు. అన్ని హాస్టళ్లలో తరచుగా తనిఖీ చేయడం ద్వారా ఫలితాలు వస్తాయన్నారు. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలని తెలిపారు. ఈసమావేశంలో మూడు జిల్లాల అధికారులు ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment