పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళిక
ఎర్రుపాలెం: అడవులు, గుట్టలు కేంద్రంగా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెం మండలం జమలాపురంలో రూ.5.83 కోట్లతో నిర్మించే అటవీ పార్కు పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశ పర్యాటక రంగంలో ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేక స్థానం ఉండేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఏళ్లుగా జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధిని ప్రజలు ఆకాంక్షిస్తున్నందున గతంలో జమలాపురం చెరువును ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేశామన్నారు. అయితే, గత ప్రభుత్వ హయాంలో ఆశించిన రీతిలో నిధులు మంజూరు కాలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున అడవులను ధ్వంసం చేయకుండా అవసరమైన అభివృద్ధికి రంగం సిద్ధం చేశామని భట్టి తెలిపారు. తద్వారా ప్రజలకు ఆదాయం పెరుగుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఆరు నెలల్లోగా అటవీ పార్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఫారెస్టు అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే, బుచ్చిరెడ్డిపాలెం చెరువు, మామునూరుపేట చెరువులను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. కాగా, సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మొదలవుతాయని, ఈ అంశంలో దరఖాస్తుల ఆధారంగా సర్వే చివరి దశకు చేరిందని భట్టి తెలిపారు. తొలుత మండల కేంద్రంలో రూ.18 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులతో పాటు రూ.10 కోట్లతో నిర్మించనున్న గట్లగౌరారం – సత్యనారాయణపురంలో రహదారి పనులే కాక వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమానాయక్, అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, ఆర్డీఓ నర్సింహారావు, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలతతో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు శీలం ప్రతాపరెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, బండారు నర్సింహారావు, యరమల పూర్ణచంద్రారెడ్డి, బొగ్గుల గోవర్దన్‌రెడ్డి, కడియం శ్రీనివాసరావు, మల్లెల లక్ష్మణరావు, షేక్ ఇస్మాయిల్, శీలం శ్రీనివాసరెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Comments
Please login to add a commentAdd a comment