శరవేగంగా ఖిల్లాపైకి రోప్‌వే నిర్మాణం
● అక్కడే రెస్టారెంట్, మినీ థియేటర్ కూడా.. ● పర్యాటక అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంవన్‌టౌన్: ఖమ్మం ఖిల్లాను రాష్ట్రానికే తలమానికంగా నిలిపేలా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన నేలకొండపల్లి బౌద్ధస్ధూపం, భక్తరామదాసు ధ్యాన మందిరం అభివృద్ధితో పాటు ఖిల్లాపైకి రోప్‌వే నిర్మాణం, ఇతర పనులపై తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎండీ ప్రకాష్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖిల్లాపైకి పర్యాటకులు సులువుగా చేరుకునేలా రోప్‌వే నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. రోప్‌వే ప్రారంభ స్థానాన్ని లకారం పార్క్ వద్ద ఏర్పాటు చేసేందుకు సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. అది సాధ్యం కాకపోతే పాత మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభించాలని తెలిపారు. కాగా, పనుల్లో రాజీ పడకుండా నాణ్యతకు పెద్దపీట వేయాలని చెప్పారు. ఇక ఖిల్లాపై అమ్యూజ్‌మెంట్ పార్కులు, రెస్టారెంట్, మినీ థియేటర్, షాపింగ్ కాంప్లెక్స్, వ్యూపాయింట్, వాటర్ ఫౌంటేన్ ఏర్పాటుచేయాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. పర్యాటక శాఖ కు అవసరమైన భూమిని త్వరగా అప్పగించాలని, సుందరీకరణ పనులకు అవసరమైన నిధులను కేఎంసీ నుంచి మంజూరు చేయాలని సూచించారు. ఇందుకోసం నియోజకవర్గ అభివృద్ధి నిధులను సైతం కేటాయిస్తానని మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment