11నుంచి నీటి సరఫరా నిలిపివేత
కూసుమంచి: పాలేరు రిజర్వాయర్ నుంచి యాసంగి పంటల సాగుకు నీరు విడుదల చేస్తుండగా వారబందీ విధానంలో భాగంగా ఈనెల 11నుంచి ఆరు రోజుల పాటు నిలిపివేయనున్నారు. ఈవిషయాన్ని జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు వెల్లడించారు. మండలంలోని పాలేరు రిజర్వాయర్‌ను మంగళవారం పరిశీలించిన ఆయన పూర్తిస్థాయి నీటిమట్టం, కాల్వల ద్వారా సరఫరా వివరాలు ఆరా తీశారు. అలాగే, కాల్వకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించి మరమ్మతులపై సూచనలు చేయగా, యూటీ వద్ద నీరు ఎత్తిపోస్తున్న మోటార్ల పనితీరును పరిశీలించారు. వారబందీ విధానంలో విడుదలవుతున్న నీటిని రైతులు పొదుపుగా వాడుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఈలు మధు, రత్నకుమారి పాల్గొన్నారు.
రేపు అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి బాలికల అండర్–19 క్రికెట్ జట్టు ఎంపికకు ఈనెల 9న పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా సంఘం కార్యదర్శి ఎం. డీ.మూసాకలీం తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉదయం 9గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ మేరకు బాలికలు గుర్తింపు కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని తెలిపారు.
మిర్చి విక్రయాలు సజావుగా సాగేలా ఏర్పాట్లు
ఖమ్మంసహకారనగర్: మిర్చి సీజన్ మొదలవుతున్నందున విక్రయాలు సాఫీగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన మిర్చి కొనుగోళ్లు, హోంగార్డుల కేటాయింపు, ధరల నిర్ణయం, ఫైర్ ఇంజన్ కేటాయింపు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఖమ్మం మార్కెట్‌కు జిల్లాతో పాటు సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి రైతులు మిర్చి తీసుకొచ్చే అవకాశమున్నందున అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మిర్చి గ్రేడింగ్ యంత్రాలు సమకూర్చుకోవాలని తెలిపారు. అలాగే, అదనంగా సిబ్బందిని నియమించుకోవడమే కాక భద్రత కోసం 20 మంది హోంగార్డులను కేటాయించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య రాకుండా రాకపోకలను నియంత్రించాలని, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం, ఏసీపీ యూ.ఎస్.రాజు, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ షఫీఉల్లా, డీఏఓ డి.పుల్లయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి బి.అజయ్‌కుమార్, ఖమ్మం మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంచుకొండ లిఫ్ట్‌కు త్వరలోనే శంకుస్థాపన
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలానికి సాగర్ జలాలు అందించేందుకు ప్రధాన కాల్వలపై మంచుకొండ ఎత్తిపోతల పథకం నిర్మించనుండగా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈమేరకు మంగళవారం జలవనరుల శాఖ డీఈ ఝాన్సీ, ఏఈ శ్రీరాం ఆధ్వర్యాన వీ.వీ.పాలెం నుంచి చింతగుర్తి వరకు ప్రధాన పైపులైన్ నిర్మాణానికి సర్వే చేశారు. రూ.66 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ పథకం ద్వారా మండలంలోని 30 చెరువులకు నీరు ఎత్తిపోసి 2,400కు పైగా ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సంక్రాంతి రోజున శంకుస్థాపన చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ప్రకటించడంతో త్వరలోనే కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఈనేపథ్యాన సర్వే అనంతరం డీఈ ఝాన్సీ మాట్లాడారు. సుమారు 9 కి.మీ. మేర మంచుకొండ వరకు ప్రధాన పైపులైన్, అక్కడి నుంచి మరో 25 కి.మీ. మేర చెరువులకు పంపిణీ చేసేలా లింక్ పైపులైన్లు ఉంటా యని తెలిపారు. సుమారు 38.59 క్యూసెక్కుల సాగర్ జలాలు వాడుకునేలా ఈ పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment