మిర్చి ధర వెనుకడుగు..
ఖమ్మంవ్యవసాయం: మిర్చి కొత్త పంట విక్రయాలు క్రమంగా పెరుగుతుండగా ధర మాత్రం పతనం దిశగా సాగుతోంది. ఈ ఏడాది మిర్చిని కొంత ముందుగా సాగు చేయడంతో పంట కూడా ముందుగానే చేతికొస్తోంది. ఈనేపథ్యాన సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 11,006 బస్తాల తేజా మిర్చి, 1,005 తాలు మిర్చితో పాటు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి 2,610 బస్తాలను విక్రయానికి తీసుకొచ్చారు. ఇందులో కొత్త మిర్చికి గరిష్టంగా రూ.15,800, మోడల్ ధర రూ.14వేలుగా నమోదవడంతో పాటు కనిష్టంగా రూ.5వేల ధర నమోదైంది. ఇక నిల్వ చేసిన మిర్చికి గరిష్టంగా రూ.15వేలు, మోడల్ ధర రూ.12,500, కనిష్టంగా రూ.6వేల ధర దక్కింది. డిసెంబర్ 27న నిల్వ మిర్చి క్వింటాకు గరిష్టంగా రూ.16వేల ధర నమోదుకాగా ఇప్పుడు రూ.వేయి తగ్గడం గమనార్హం. గత ఏడాది సీజన్‌లో రూ.22వేల వరకు పలకగా, ఇప్పుడు ఆ దరిదాపుల్లో లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయంగా మిర్చికి డిమాండ్ పడిపోవడం, విదేశీ ఎగుమతులు మందగించడమే ధర పతనానికి కారణాలుగా వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment