ఫ్రీజర్ల కొనుగోలుకు రూ.8లక్షల మంజూరు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మార్చురీలో ఫ్రీజర్ల కొనుగోలుకు ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి రూ.8 లక్షలు మంజూరు చేశారు. ఇటీవల ఆయన పెద్దాస్పత్రిని సందర్శించిన సందర్భంలో ఫ్రీజర్ల కొరత ఉందని సూపరింటెండెంట్ తెలిపారు. దీంతో ఆరు ఫ్రీజర్ల కొనుగోలుకు రూ.8లక్షల ఎంపీ నిధులు కేటాయించారు.
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె విరమణ
ఖమ్మం సహకారనగర్: సర్వీసు క్రమబద్ధీకరణతో పాటు ఇతర సమస్యల పరిష్కారం సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు చేస్తున్న సమ్మెను సోమవారం విరమించారు. అయితే, రోజులాగే సోమవారం కలెక్టరేట్ వద్ద వంటావార్పుతో నిరసన తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘం నాయకులు హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించగా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీంతో సమ్మె విరమించామని, మంగళవారం నుంచి యథావిధిగా విధులు నిర్వర్తిస్తామని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహబూబ్ పాషా తెలిపారు.
మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్–2, 3, 4తో పాటు కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. నాలుగు నెలల పాటు కొనసాగే శిక్షణకు డిగ్రీ పూర్తి చేసుకున్న మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తుతోపాటు ఆధార్‌కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, డిగ్రీ మెమో, రెండు ఫొటోలు జతచేసి కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 10లోగా సమర్పించాలని, వివరాలకు 97040 03002 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
పెండింగ్ పనుల్లో
వేగం పెంచండి
కొణిజర్ల: వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని జెడ్పీ సీఈఓ దీక్షా రైనా సూచించారు. కొణిజర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఆమె సోమవారం వివిధ శాఖల ప్రగతిపై సమీక్షించారు. పనుల వారీగా వివరాలు తెలు సుకున్న ఆమె త్వరగా పూర్తి చేయాలని సూచించడంతో పాటు ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో ఎంపీడీఓ ఏ.రోజారాణి, తహసీల్దార్ తఫజల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
బాలల హక్కుల
అమలుపై శ్రద్ధ
ఖమ్మంలీగల్: బాలలకు ఉన్న హక్కులు అమలయ్యేలా శ్రద్ధ వహించాలని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్‌రావు సూచించారు. ఖమ్మంలోని సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈమేరకు హక్కుల పరిరక్షణకు ఉన్న చట్టాల అమలుపై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం మామిడి హన్మంతరావు, విష్ణువందన, పసుమర్తి లలిత చట్టాలపై అవగాహన కల్పించగా, ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం అర్బన్ మండలం వైఎస్సార్‌నగర్ కాలనీలో జరిగిన సమావేశంలో కే.వీ.చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు, పేదలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలో అవగాహన కల్పించారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మల్లెబోయిన వలరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment