ఇక ఎయిర్‌పోర్టు సర్వే..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 38 లక్షలు మంజూరు
● త్వరలో కొత్తగూడెంలో ప్రారంభంకానున్న సర్వే పనులు ● అటవీ, ప్రైవేటు భూములు సేకరించాలని నిర్ణయం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు టెక్నో ఎకనా మిక్ ఫీజిబులిటీ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.38 లక్షల బడ్జెట్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో మరోసారి ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం సర్వే చేపట్టి నివేదిక సమర్పిస్తారు. రాష్ట్రంలో ఆరు రీజినల్ ఎయిర్‌పోర్టులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో కొత్తగూడెం కూడా ఉంది. గతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం సూచించిన స్థలంలో టెక్నో ఎకనామిక్ ఫీజిబులిటీ సర్వే చేపట్టారు. ఆ స్థలం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువుగా లేదని రిపోర్టులో తేలింది. దీంతో కొత్తగా రామవరం దగ్గర చూపిస్తున్న స్థలంలో మరోసారి సర్వే చేపట్టేందుకు బడ్జెట్ కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడంతో త్వరలోనే ప్రీ ఫీజుబులిటీ, ఓఎల్‌ఎస్ (ఆబ్‌స్టికల్ లిమిటేషన్ సర్వే)లు కూడా నిర్వహించనున్నారు. మూడేళ్లలో ఈ ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తేవాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
రామవరం – గరీబ్‌పేట–సుజాతనగర్
రేణుకా చౌదరి కేంద్రమంత్రిగా పని చేసిన కాలంలో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు అంశం తెర మీదకు వచ్చింది. సుజాతనగర్ ప్రాంతంలో నిర్మిస్తారనే వార్తలు షికారు చేసినా ఆ తర్వాత స్తబ్ధత ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక, పాల్వంచ మండలం గుడిపాడు –బంగారుజాల మధ్య ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. పాల్వంచ పట్టణంలో ఓవైపు ఎత్తైన కొండలు ఉంటే మరోవైపు కేటీపీఎస్‌కు సంబంధించిన భారీ నిర్మాణాలు ఉన్నా యి. వీటితోపాటు ముర్రేడు, కిన్నెరసాని ప్రవాహాలు ఉన్నాయి. దీంతో సాంకేతికంగా పాల్వంచ పరిసర ప్రాంతాలు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుకూలం కాదని తేలింది. ప్రస్తుతం కొత్తగూడెం సమీపంలోని గరీబ్‌పేట చుట్టూ చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం మండలాల పరిధిలో తొమ్మిది వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏడువందల ఎకరాలు ఫారెస్టు ల్యాండ్‌తోపాటు ఇతర ప్రైవేటు స్థలాలను సేకరించి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఉపయోగించాలని నిర్ణయించారు.
ఏడాది నుంచి జోరుగా..
17 ఏళ్ల నుంచి ఇప్పటివరకు కొత్తగూడెం ఎయిర్‌పోర్టు అంశంపై అనేక సార్లు ప్రతిపాదనలు రావడం, సర్వేలు జరగడం మళ్లీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉండేది. 2024 ఆరంభం నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర పెద్దలకు స్వయంగా ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మున్సిపల్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి వినతి పత్రం సమర్పించగా, అక్కడి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. ఏడాది కాలంగా ఎయిర్‌పోర్టు నిర్మాణంపై క్రమం తప్పకుండా సానుకూల ప్రకటనలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment