కృష్ణా, గోదావరి సంగమం
రైతులు భూమి కోల్పోకుండా..
పాలేరుకు గోదావరి జలాలు చేరవేసేందుకు కాల్వ నిర్మాణానికి తొలుత సిద్ధమైనా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో 830 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని ప్రతిపాదనల్లో పొందుపర్చారు. ఇందుకోసం రైతుల భూములే ఎక్కువగా ఉండడంతో అటు భూసేకరణ, ఇటు పరిహారం భారం తగ్గేలా టన్నెల్‌కే మొగ్గుచూపారు. దీంతో 521 ఎకరాల భూసేకరణ అవసరం లేదని తేల్చి, మిగతా 309 ఎకరాలు సేకరించి రైతులకు పరిహారం అందజేశారు. భూసేకరణ తగ్గడంతో తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం, బీరోలు, తాళ్లచెరువు, మేడిదపల్లి, పాతర్లపాడు, కూసుమంచి మండలంలోని పోచారం గ్రామ రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
కృష్ణా, గోదావరి నదుల పరీవాహకాలను కలిపే వారధిగా పాలేరు టన్నెల్ నిలవనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా బేసిన్‌లోని పాలేరు రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను తరలించేలా ఈ టన్నెల్ నిర్మాణమవుతోంది. రైతుల నుంచి భూమి ఎక్కువ సేకరించకుండానే పాలేరు రిజర్వాయర్‌లోకి నీళ్లు చేర్చేలా చేపట్టిన ఈ టన్నెల్ ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం ప్రాజెక్టుల తర్వాత స్థానంలో నిలవనుంది. గతంలో టన్నెళ్ల నిర్మాణానికి చైనా, ఇతర దేశాల బోరింగ్ యంత్రాలను ఉపయోగిస్తే ఇక్కడ మాత్రం స్వీడన్ నుంచి తెప్పించిన అధునాతమైన నాలుగు డ్రిల్లింగ్ మిషన్లను వాడుతుండడంతో పనులు చకచకా సాగుతున్నాయి.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
ఎన్నెస్పీ ఆయకట్టుకు జీవం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు(ఎన్నెస్పీ) రెండో జోన్ పరిధి కింద ఖమ్మం జిల్లాలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా నది ఎగువన వర్షాలు పడి ప్రాజెక్టులు నిండితేనే సాగర్ జలకళ సంతరించుకుని ఆపై జిల్లాకు నీరు అందుతోంది. అయితే, కృష్ణా పరీవాహకం కంటే ముందే గోదావరి పరీవాహకాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతుండగా మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల్లో భారీ వర్షాలు నమోదై ఏటా జూలై నుంచే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సమయానికి కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు వట్టిపోయి పలుమార్లు వానాకాలం, యాసంగి సీజన్లలో సాగునీరు ఇవ్వలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యాన గత ప్రభుత్వం జీవనదిలా నిత్యం కళకళలాడే గోదావరి జలాలతో ఎన్నెస్పీ ఆయకట్టు స్థిరీకరణకు సీతారామ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమాన రెండు నదుల పరీవాహకాలను కలిపేలా సీతారామ ప్రధాన కాల్వకు అనుసంధానంగా పాలేరు లింక్ కెనాల్‌ను ఏన్కూరు వద్ద నిర్మిస్తున్నారు.
రోజుకు 28 మీటర్లు..
సీతారామ ప్రాజెక్టులో భాగంగా 62.7వ కి.మీ. నుంచి 76.9 కి.మీ. వరకు పనులను 16వ ప్యాకేజీ కింద చేపట్టగా ఇందులోనే కాల్వ, టన్నెల్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం నుంచి కూసుమంచి మండలం పోచారం వరకు 8.2 కి.మీ. మేర టన్నెల్ ఉండగా మిగతా 4.5 కి.మీ. మేర కాల్వ ఉంటుంది. ఈ పనులను 2023 ఆగస్టులోనే మొదలుపెట్టినా గత ఏడాది వరదల నేపథ్యాన ముందుకు సాగలేదు. ఇటీవలే పనుల్లో వేగం పుంజుకోవడంతో టన్నెల్ తవ్వకం 2.9 కి.మీ. మేర పూర్తయింది. మొత్తంగా నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం స్వీడన్ నుంచి రూ.4.5 కోట్ల విలువైన నాలుగు డ్రిల్లింగ్ మిషన్లు తెప్పించిన కాంట్రాక్టు సంస్థ 380 మంది కార్మికులతో మూడు షిఫ్టుల్లో పని చేయిస్తోంది. తొలుత బీరోలు వద్ద కొంతమేర తవ్వి అక్కడి నుంచి ఎడమ, కుడివైపులా రెండు డ్రిల్లింగ్ మిషన్లు, ఇన్‌లెట్, ఔట్ లెట్ నుంచి మరో రెండు మిషన్లు.. మొత్తంగా నాలుగు మిషన్లతో రోజుకు 28 మీటర్ల మేర తవ్వకం చేపడుతున్నారు.
మల్టీపర్పస్‌లా పాలేరు టన్నెల్..
పాలేరు టన్నెల్‌ను భవిష్యత్‌లో మల్టీ పర్పస్‌గా ఉపయోగించుకునేలా నిర్ణయించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను మోటార్లతో ఎత్తిపోసేలా డిజైన్ చేశారు. భవిష్యత్‌లో మోటర్లలో సమస్య ఏర్పడితే పాలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలు చేరడం కష్టమే. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇటీవల మున్నేరు నీటిని పాలేరు రిజర్వాయర్‌కి చేర్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది. దీనిపై రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి సారించడంతో తాజాగా అధికారులు డీపీఆర్ సమర్పించారు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ దిగువ భాగాన పాకాల, బయ్యారం అలుగుల ద్వారా ప్రవాహం మున్నేరులో కలుస్తోంది. ఈ నీటిని కాల్వ ద్వారా సమీపంలోని పాలేరు లింక్ కెనాల్‌లోకి చేరిస్తే టన్నెల్ ద్వారా పాలేరు రిజర్వాయర్‌లోకి వస్తాయి. ఫలితంగా కృష్ణా చేసిన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, గోదావరి జలాలను సీతారామ పంపులతో ఎత్తిపోయలేని పరిస్థితులు ఎదురైనప్పటికీ మున్నేరు నీటితో పాలేరు జలకళ సంతరించుకుని ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే క్రతువులో టన్నెల్ కీలకంగా మారనుంది.
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు
ఇదీ టన్నెల్ నేపథ్యం
‘సీతారామ’లో భాగంగా పరీవాహకాలను కలిపేలా పాలేరు టన్నెల్
8.2 కి.మీ. నిడివి,
9.5 మీటర్ల వ్యాసార్థంతో తవ్వకం
పనుల్లో స్వీడన్ డ్రిల్లింగ్ యంత్రాల వినియోగం
ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం టన్నెళ్లకు
మించి అధునాతన యంత్రాలు
Comments
Please login to add a commentAdd a comment