పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి గురువారం ఆయన మార్కెట్‌లోని పత్తి యార్డులో అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందని, మంటలు మొదలైనట్లు తెలియగానే స్పందించడం, పది నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్ రావడంతో ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు. అయితే, ఇలాంటివి మరోమారు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయాన ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం మార్కెట్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రూ.100 కోట్ల నిధులతో పనులు త్వరలోనే మొదలుకానున్నాయని తెలిపారు. ఆపై ఖమ్మం తరహాలో వరంగల్, నిజామాబాద్ వంటి మార్కెట్ల అభివృద్ధికి కూడా నివేదికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మిర్చి యార్డులో ఆధునికీకరణ పనుల నేపథ్యాన కొనుగోళ్లను పత్తి యార్డులో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని, మద్దులపల్లి మార్కెట్ నిర్వహణలోకి వస్తే ఖమ్మం మార్కెట్‌పై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. ఖమ్మం మేయర్ పి.నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం, ఆర్డీఓ నర్సింహారావు, మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, తల్లాడ రమేష్, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment