వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ రామచంద్రయ్య సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ రామచంద్రయ్య సస్పెన్షన్‌

Published Fri, Jan 17 2025 12:32 AM | Last Updated on Fri, Jan 17 2025 12:32 AM

-

● అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఉన్నతాధికారుల చర్యలు ● మరికొందరు ఉద్యోగులపైనా త్వరలోనే వేటు

వైరా: నిబంధనలకు విరుద్ధంగా వివాదాస్పద భూములకు సంబంధించి ఒకేరోజు 64 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ చేసిన వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ రామచంద్రయ్యపై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. వైరాలోని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గతనెల 28న 89 రిజిస్ట్రేషన్లు జరగగా ఇందులో 64 డాక్యుమెంట్లపై ఆరోపణలు వచ్చాయి. ఈక్రమాన కొణిజర్ల మండలంలోని అమ్మపా లెం, లింగగూడెం రెవెన్యూ పరిధి ఇండోఖతార్‌, గ్రీన్‌ల్యాండ్‌ భూముల రిజిస్ట్రేషన్‌పై వివాదం నెలకొనడంపై ‘అధనపు విధులు’ శీర్షికన ఈనెల 11న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. నాలా కన్వర్షన్‌ లేకుండా సుమారు 40 వేల గజాల స్థలానికి రిజిస్ట్రేషన్‌ చేయడం, ఇందులో భారీగా డబ్బు చేతులు మారి ఉంటుందనే ఆరోపణలు రాగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈసందర్భంగా సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేస్తూ కొద్దిరోజుల క్రితమే ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే, ఆ ఉత్తర్వులు గురువారం వెలుగుచూశాయి.

ఎక్కడ పనిచేసినా అంతే...

సబ్‌ రిజిస్ట్రార్‌ రామచంద్రయ్య గతంలో నిజా మాబాద్‌లో పని చేయగా అక్కడ కూడా పలు అవినీతి, ఆరోపణలు వచ్చాయని తెలిసింది. ఇక వైరాలో గత ఆగస్టులోనే విధుల్లో చేరగా ఐదు నెలలు తిరకగముందే సస్పెన్షన్‌ వేటు పడడం గమనార్హం. కాగా, భారీ సంఖ్యలో రిజి స్ట్రేషన్ల వ్యవహారం బయటకు రాగానే ఆయన ఈనెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు సెలవులో వెళ్లడం గమనార్హం. ఈ మధ్యలోనే ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రామచంద్రయ్య స్థానంలో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. కాగా, వైరా కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగడంపై జిల్లా రిజిస్ట్రార్‌పైనా మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ వ్యవహారంలోమరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశముందని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement