పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
● నేటి నుంచి 18వరకు సర్వే, ఆపై గ్రామసభలు ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26నుండి నాలుగు సంక్షేమ పథకాలను అమలుచేయనున్న నేపథ్యాన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సర్వే, లబ్ధిదారుల ఎంపిక, గ్రామసభల నిర్వహణపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసిందని తెలిపారు. ఈమేరకు అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండడమే కాక లబ్ధిదారుల ఎంపిక నిరంతరం కొనసాగుతుందనే అంశాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. అర్హులకు పథకాలు మంజూరు ఎంత ముఖ్యమో, అనర్హులెవరికీ లబ్ధి జరగకుండా చూడ డం కూడా ప్రధానమని తెలిపారు. రైతు భరోసా కింద వ్యవసాయ యోగ్యమైన భూమి ఎకరాకు ఏటా రూ.12 వేలు ఇవ్వనున్నందున వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించాలన్నారు. ఇందుకోసం గ్రామాల వారీగా పాస్‌బుక్‌లను విభజించి ఆర్‌ఐ, ఏఈఓలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశాక నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు. అలాగే, ఆత్మీయ భరోసాకు సంబంధించి భూమి లేని వారు, గత ఏడాది కనీసం 20 రోజుల ఉపాధి హామీ పని చేసిన వారిని అర్హులుగా గుర్తించాలని తెలిపారు.
నేటి నుంచి సర్వే
నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం గురువారం నుంచి సర్వే ప్రారంభించి ఈనెల 18వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆపై 20వ తేదీ నుంచి గ్రామసభలు మొదలుపెట్టి జాబితాను ప్రదర్శించాలని తెలిపారు. ప్రతీ గ్రామసభను వీడియో చిత్రీకరించాలని, రైతు భరోసా, ఆత్మీయ భరోసా జాబితాలపై ఈనెల 21, 22 తేదీల్లో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారులు మరోమారు పరిశీలించాలని సూచించారు. అలాగే, కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో మండల స్థాయిలో ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల సర్వే ముగింపు దశకు వచ్చినందున మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, డీఎస్‌ఓ చందన్ కుమార్, డీఏఓ పుల్లయ్య, హౌసింగ్ పీడీ బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment