23న ఏఏఐ బృందం రాక
● పాల్వంచ, కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో పర్యటన ● గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలన
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించేందుకు ఈనెల 23న ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) టెక్నికల్ టీమ్ జిల్లాలో పర్యటిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ బృందం 20వ తేదీనే జిల్లాకు రావాల్సి ఉంది. ఈ అంశంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో మంత్రి తుమ్మల ఫోన్‌లో గురువారం మాట్లాడారు. దీనికి కేంద్రమంత్రి స్పందిస్తూ ఏఏఐ బృందం ఈనెల 20కి బదులు 23న వస్తుందని తెలిపారు.
ఆరుగురు సభ్యుల ప్రత్యేక బృందం..
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఆరుగురు సభ్యుల ప్రత్యేకబృందం 23వ తేదీన కొత్తగూడెం, పాల్వంచ పరిసర ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో అబ్దుల్ అజీజ్ (ఏరో ప్లానింగ్), మహ్మద్ సఖీబ్(ఆర్కిటెక్ట్), ప్రశాంత్ గుప్తా (ఆపరేషన్స్), సీఎన్‌ఎస్‌ఆర్ దివాకర్ (ఆపరేషన్స్), మనీష్ జోన్వాల్, ఎఫ్‌పీడీ ప్రవీణ్ ఉన్ని కృష్ణన్ ఉన్నారు. వీరి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ, అటవీ, వాటర్ రిసోర్సెస్ శాఖల అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
రూపురేఖలు మారుతాయి
విమానాశ్రయం ఏర్పాటుతో కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వాణిజ్యపరంగా, పర్యాటకంగా, పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి విమానాశ్రయం దోహదం చేస్తుంది. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చేందుకు ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుంది.
– తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రి
Comments
Please login to add a commentAdd a comment