తల్లాడ: పండుగ వేళ కుమారుడు పంపించిన గారెలు తినే క్రమంలో గొంతులో ఇరుక్కోగా ఓ వృద్ధురాలు మృతి చెందింది. తల్లాడకు చెందిన మొక్కా తిరపతమ్మ(80) పెద్దకుమారుడితో కలిసి ఉంటుంది. కనుమ పండుగ సందర్భంగా బుధవారం ఆమెకు మరోచోట ఉండే చిన్న కుమారుడు గారెలు, చికెన్ పంపించాడు. అయితే, తిరపతమ్మకు దంతాలు సరిగా లేక నేరుగా మింగేందుకు యత్నిస్తుండగా గారె గొంతులో ఇరుక్కుపోయినట్లు తెలిసింది. దీంతో ఊపిరి ఆడక ఆమె మృతి చెందింది. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి...
కల్లూరు: ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరుకు చెందిన కారు మెకానిక్ మొగిలిచర్ల ప్రతాప్ (38) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఈనెల 15న పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబీకులు కల్లూరులో చికిత్స చేయించి ఖమ్మం తరలించగా పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు. ఘటనపై ఆయన సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వాహనం ఢీకొని మూడు గొర్రెలు మృతి
తల్లాడ: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మూడు గొర్రెలు మృతి చెందగా, మరో రెండింటికి తీవ్ర గాయాలయ్యాయి. మండలం రామానుజవరానికి చెందిన రాచబంటి కిషోర్, గోపిదేశి రామకృష్ణ, లీలమ్మ రెడ్డిగూడెంలో కొద్దిరోజులుగా ఉంటూ గొర్రెలను మేపుతున్నారు. రోజుమాదిరిగానే గొర్రెలను మేపుకొని రెడ్డిగూడెం వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మందలోని మూడు జీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో రెండింటికి తీవ్ర గాయాలు కాగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment