అగ్గి లేస్తే బుగ్గిపాలే..
ఖమ్మం మార్కెట్‌లో పంటలకు భద్రత కరువు
● పుష్కరకాలం క్రితమే ఫైర్‌స్టేషన్‌కు శంకుస్థాపన, 2015లో ప్రారంభం ● ఫైర్ ఇంజన్ కోసం రూ.58 లక్షలు చెల్లించి మరీ ఎదురుచూపులు ● తాజాగా కాలిబూడిదైన 1,100 బస్తాల పత్తి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఉమ్మడి జిల్లా నుంచే కాక మహబూబాబాద్, సూర్యాపేటతో పాటు ఏపీలోని పలు జిల్లాల నుంచి రైతులు పత్తి, మిర్చిని విక్రయానికి తీసుకొస్తుంటారు. పత్తి, మిర్చి సీజన్లలో నిత్యం రూ.కోటి నుంచి రూ.2కోట్ల మేర పంటల క్రయవిక్రయాలు జరుగుతాయి. ఇంతటి పేరున్న ఈ మార్కెట్‌లో అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగితే తక్షణమే మంటలను అదుపు చేసేలా ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. అయితే, మార్కెట్ ఆవరణలో ఏళ్ల క్రితమే ఫైర్ స్టేషన్ నిర్మించడంతో పాటు ఫైర్‌ఇంజన్ కోసం రూ.58లక్షలు డిపాజిట్ చేసినా వాహనాన్ని కేటాయించలేదు. ఫలితంగా బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరగగా ఇతర చోట్ల నుంచి వాహనాలు వచ్చేసరికి రూ.30లక్షల విలువైన 1,100 బస్తాల పత్తి కాలిబూడిదైంది.
2012లోనే బీజం
భారీగా లావాదేవీలు జరిగే ఖమ్మం మార్కెట్‌లో ఫైర్ స్టేషన్ ఆవశ్యకతను గుర్తించి 2012–13లో నాటి పాలకవర్గం రూ.80 లక్షలను కేటాయించడంతో భవనం నిర్మించి బోర్ వేయించారు. ఆతర్వాత ఫైర్ ఇంజన్ కోసం రూ.58 లక్షల డీడీని అగ్నిమాపక శాఖ డీజీపీకి అందజేశారు. అంతేకాక ఫైర్ స్టేషన్‌ను 2015 ఏప్రిల్ 26న నాడు కూడా మంత్రిగానే ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించగా. ఇప్పటికీ ఫైర్ ఇంజన్ మాత్రం చేరలేదు.
ఇదైతే ఉండనివ్వండి..
మంత్రి ఫైర్ స్టేషన్‌ను ప్రారంభించిన సమయాన తాత్కాలికంగా ఖమ్మం అగ్నిమాక కేంద్రానికి చెందిన ఓ పాత వాహనాన్ని కేటాయించారు. కానీ శాఖ సిబ్బందిని కేటాయించకపోవడంతో ఔట్ సోర్సింగ్ ద్వారా 20 మందిని తీసుకున్నారు. ఆరు నెలలు నిర్వహించాక అన్ సీజన్ పేరిట ఫైర్ ఇంజన్‌ను తిరిగి అగ్నిమాక శాఖ తీసుకెళ్లింది. అప్పటి నుంచి మార్కెట్‌కు ఫైరింజన్ కేటాయించాలని అగ్నిమాపక శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తు న్నా సానుకూల స్పందన రాలేదు. అంతేకాక మార్కెట్‌లో నిర్మించిన అగ్ని మాపక కేంద్రం ఎలాగూ ఖాళీగా ఉంటోందని తాత్కాలికంగా మార్కెట్ పరిపాలనా విభాగాన్ని నిర్వహిస్తుండడం గమనార్హం.
ఈసారైనా కరుణిస్తారా?
మార్కెట్‌లో అగ్ని ప్రమాద స్థలాన్ని గురువారం పరిశీలించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడి నుంచే ఫైరింజన్ కేటాయింపుపై శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఏళ్ల క్రితం ఫైర్‌స్టేషన్ భవనాన్ని నిర్మించడం, వాహనం కోసం వాటా ధనాన్ని చెల్లించిన విషయాన్ని వివరించగా సానుకూలమైన సమాధానం వచ్చిందని మంత్రి ప్రకటించారు.
ప్రమాదాలు జరిగినప్పుడే చర్చ
ఖమ్మం మార్కెట్‌లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫైర్ ఇంజన్ లేదనే అంశం గుర్తుకొస్తోంది. రూ.58లక్షలు చెల్లించి 12ఏళ్లు కావొస్తున్నా తోచినప్పుడే ఆరా తీస్తూ వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. మార్కెట్‌లో 2023 డిసెంబర్‌లో ఓ వ్యాపారికి చెందిన రూ.40 లక్షల విలువైన పత్తి అగ్నిప్రమాదంలో కాలిపోయింది. తాజాగా బుధ వారం ఇద్దరికి చెందిన రూ.30లక్షల విలు వైన 1,100 బస్తాల పత్తి బూడిదైంది. ఈ రెండు ప్రమాదాల సమయాన ఫైరింజన్ సకాలంలో రాకపోవడంతో నష్టతీవ్రత పెరిగింది.
తాత్కాలికంగా వాహనం
ఖమ్మం మార్కెట్‌లో అగ్నిప్రమాదం జరగడం, మంత్రి తుమ్మల పరిశీలన నేపథ్యాన అధికారులు గురువారం రాత్రి ఓ ఫైరింజన్‌ను పంపించారు. ఈ వాహనం వెంట పలువురు సిబ్బంది కూడా ఉన్నారు. అయితే, ఈ వాహనం ఎంతకాలం ఉంటుంది, శాశ్వత ఫైరింజన్‌ను ఎప్పుడు కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment