పండుగ ముగిసింది..
● మొదలైన తిరుగు ప్రయాణం ● జిల్లా నుంచి హైదరాబాద్ బస్సుల్లో రద్దీ ● ఇదే అదునుగా ఆర్టీసీ ‘స్పెషల్’ బాదుడు
సత్తుపల్లిటౌన్: సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చిన ప్రజలు తిరుగుముఖం పడుతున్నారు. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు మళ్లీ అక్కడకు బయలుదేరుతున్నారు. దీంతో బస్టాండ్లు మళ్లీ రద్దీగా మారుతుండగా.. ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌కు స్పెషల్ పేరిట నడిపిస్తున్న బస్సుల్లో చార్జీల మోత మోగుతోంది. దీంతో పండుగ ఆనందంగా జరుపుకుని వెళ్తున్న వారు చార్జీలు చూసి లబోదిబోమంటున్నారు.
సత్తుపల్లి నుంచే అత్యధికంగా..
ఖమ్మం రీజియన్‌లో ఇతర డిపోలతో పోలిస్తే ఖమ్మం తర్వాత సత్తుపల్లి నుంచే అత్యధికంగా ప్రయాణికులు హైదరాబాద్‌కు వెళ్తున్నారు. సాధారణ రోజుల్లో సత్తుపల్లి డిపో నుంచి రోజుకు 16 సూపర్‌లగ్జరీ, నాలుగు రాజధాని, ఒక లహరి బస్సు కలిపి 21 సర్వీసులు ఉంటాయి. ప్రస్తుతం రద్దీ దృష్ట్యా ఈ బస్సులతో పాటు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం డిపోల నుంచి కూడా కొన్నింటిని సత్తుపల్లి కేటాయించి హైదరాబాద్ నడిపిస్తున్నారు. దీంతో ఈనెల 15వ తేదీన రెగ్యులర్ సర్వీసులే కాక అదనంగా 15, 16వ తేదీన 13 అదనపు సర్వీసులు నడిపించగా, 17వ తేదీన సైతం పది అదనపు సర్వీసులు నడిపించాలని నిర్ణయించారు. కాగా, రద్దీ దృష్ట్యా డీఎం యు.రాజ్యలక్ష్మి, సీఐ విజయశ్రీ, వీబీఓ ఆనంద్, సూపర్‌వైజర్లు బస్టాండ్‌లోనూ ఉంటూ పర్యవేక్షిస్తున్నారు.
చార్జీల మోత ఇలా..
రెగ్యులర్ సర్వీసుల్లో ఈనెల 19వ తేదీ వరకు సీట్లన్నీ ముందుగానే రిజర్వ్ అయ్యాయి. దీంతో అదనపు బస్సులకు డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యాన అధికారులు చార్జీలు పెంచడంతో ప్రయాణికులపై భారం పడుతోంది. డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని బస్సుల్లో అదనంగా 50శాతం చార్జీ వసూలు చేస్తున్నారు. సత్తుపల్లి నుంచి హైదరాబాద్ డీలక్స్ బస్సులో రూ.460 ఉండగా స్పెషల్ చార్జీ పేరిట రూ.680, సూపర్‌లగ్జరీ బస్సుల్లో రూ.550 ఉంటే రూ.780, రాజధాని బస్సుల్లో రూ.690 ఉండగా రూ.960 చొప్పున చార్జీ నిర్ణయించారు. దీంతో పండుగ రావడం మాటేమో కానీ బస్సు ప్రయాణంతో జేబుకు చిల్లు పడుతోందని పలువురు మండిపడుతున్నారు. కాగా, హైదరాబాద్‌కు వెళ్లే సమయాన రద్దీ ఉంటున్నప్పటికీ తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి ఉండడంతో చార్జీ పెంచినట్లు అధికారులు చెబుతున్నారు.
రద్దీకి అనుగుణంగా బస్సులు..
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపిస్తున్నాం. రిజర్వేషన్ బస్సులతో పాటు అదనపు సర్వీసులు ఏర్పాటుచేశాం. ఇతర డిపోల నుంచి బస్సులను కేటాయించడంతో బస్సుకు సరిపడా జనం రాగానే వేచి ఉండకుండా పంపిస్తున్నాం.
– యు.రాజ్యలక్ష్మి, ఆర్టీసీ డీఎం, సత్తుపల్లి
Comments
Please login to add a commentAdd a comment