మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని ఏడు మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కస్తాల సత్యనారాయణ తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి గాను 5నుంచి 8వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు www.tmreistelangana. cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 18 నుండి ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. మొత్తం సీట్లలో 75శాతం మైనార్టీలకు, 25శాతం మిగతా వారికి కేటాయిస్తామని, ప్రతీ కేటగిరీలో అనాథలు, దివ్యాంగులు, వితంతువుల, సైనిక ఉద్యోగులు/విశ్రాంత ఉద్యోగుల పిల్లలకు మూడు శాతం రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు.
22 పోస్టులకు
1,014 దరఖాస్తులు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ఎన్‌హెచ్‌ఎం విభాగంలో ఖాళీ పోస్టులను తాత్కాలిక/కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీకి నిర్ణయించగా 1,014 దరఖాస్తులు అందాయని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి తెలిపారు. 19 ఎంఎల్‌హెచ్‌పీ, మూడు బీడీకే మెడికల్ ఆఫీసర్ పోస్టులు కలిపి 22 ఖాళీలు ఉండగా.. ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎంతో పాటు బ్రిడ్జి కోర్సు పూర్తిచేసి వారు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే మెరిట్ లిస్ట్‌ను https://khammam.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో పొందుపర్చగా, అభ్యర్థుల వివరాల్లో తప్పులు ఉంటే ఈనెల 18లోగా వెబ్‌సైట్‌లోని ఫాంలో నమోదు చేయాలని సూచించారు. ఆపై సర్టిఫికెట్ల జిరాక్స్‌లు జతపరిచిన దరఖాస్తులను తమ కార్యాలయంలో అందజేయాలని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
విజయ డెయిరీతో
పాడిరైతులకు మేలు
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వ పాడి పరిశ్రమ అయిన విజయ డెయిరీకి పాలు సమకూర్చడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఖమ్మం డీడీ పి.మోహనమురళి తెలిపారు. ఖమ్మంలోని విజయ డెయిరీ ఆవరణలో గురువారం రైతులకు ఇచ్చే రుణాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ ప్రభుత్వ పాడి పరిశ్రమకు పాలు పోసే రైతులకు ప్రోత్సాహకాలు, రుణాలను అందిస్తున్నామని తెలిపారు. ఐఐఎఫ్‌ఎల్(ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్) ద్వారా పాడి గేదెల కొనుగోలు కోసం మహిళా రైతులకు రుణాలు ఇవ్వనుందని చెప్పారు. అనంతరం పాల సేకరణలో తీసుకోవాల్సిన మెళకువలు, నాణ్యతపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డెయిరీ మేనేజర్ సిద్దేశ్వర్, ఐఐఎఫ్‌ఎల్ సంస్థ బాధ్యులు దేవేంద్ర, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
వైరారూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని, తద్వారా విద్యారంగం బలోపేతానికి కృషి చేయాలని డీఈఓ సోమశేఖరశర్మ కోరారు. వైరా మండలంలోని నారపునేనిపల్లి యూపీఎస్‌లో కేవలం ఒక విద్యార్థి మాత్రమే ఉండగా గురువారం ఆయన పాఠశాలను సందర్శించారు. ఆ తర్వాత పలువురి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తుండడమే కాక ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఈమేరకు తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ఆయన వెంట ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment