‘ఇందిరమ్మ భరోసా’కు బాటలు..
● ఉపాధి పనుల ఆధారంగా అర్హుల గుర్తింపు ● జాబ్‌కార్డుల ద్వారా వివరాలు సేకరిస్తున్న అధికారులు ● కూలీల సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు ● జిల్లాలో 20 రోజులు పని చేసిన కుటుంబాలు 90 వేలు
ఖమ్మంమయూరిసెంటర్ : వ్యవసాయ భూమి లేని కూలీలకు ఇందిరమ్మ భరోసా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కూలీలకు ఈ పథకం కింద కుటుంబానికి రూ.12 వేలు అందించనుండగా.. అర్హులను గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఉపాధి పనులకు వెళ్లే వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అర్హుల గుర్తింపు ప్రక్రియను ఈజీఎస్ సిబ్బందికి అప్పగించారు. ఇలా సేకరించిన వివరాలను ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. ఈనెల 26వ తేదీ లోపు అర్హులను గుర్తించడంతో పాటు గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితా ప్రకటించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీంతో క్షేత్ర స్థాయిలో అర్హుల వివరాల సేకరణను వేగవంతం చేశారు.
జాబ్‌కార్డుల ఆధారంగా..
ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాల వివరాలను ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్ నుంచి రాష్ట్ర అధికారులు సేకరించారు. దీన్ని జిల్లాల వారీగా విభజించి ఆయా జిల్లాల అధికారులకు అందజేశారు. వీటి ఆధారంగా ఖమ్మం జిల్లాలో ఉపాధి పనులకు వెళ్తున్న కూలీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 20 రోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబాల్లో భూమి లేని వారి వివరాలను సేకరిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు..
జిల్లాలో ఈజీఎస్ కూలీల ఇళ్లకు వెళ్తున్న అధికారులు.. వారి ఆధార్, బ్యాంక్ ఖాతా నంబర్లు నమోదు చేసుకుంటున్నారు. గ్రామాల్లో ఈ వివరాలు సేకరించే బాధ్యతను ఫీల్డ్ అసిస్టెంట్‌లు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్‌లకు అప్పగించారు. వీరు సేకరించిన సమాచారాన్ని మండల సీఓలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వీటిని మండల స్థాయిలో ఏపీఓలు పర్యవేక్షిస్తుండగా.. జిల్లా స్థాయిలో ఏపీడీలు, పీడీ పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 90 వేల కుటుంబాలు 20 రోజుల పనిదినాలు పూర్తి చేసినట్టు గుర్తించగా.. వారిలో సుమారు 35 వేల కుటుంబాలకు వ్యవసాయ భూమి లేనట్లు తెలుస్తోంది.
గ్రామ సభల్లో వెల్లడి..
వ్యవసాయ భూమి లేని కూలీల కుటుంబాలను సిబ్బంది గుర్తించిన తర్వాత వారి వివరాలతో కూడిన జాబితాను గ్రామ సభల్లో ప్రజల ముందు వెల్లడించనున్నారు. ఆ తర్వాత అర్హులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. అర్హుల జాబితా పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. గ్రామ సభల్లో అర్హులుగా గుర్తింపు పొందిన వారికి ఇందిరమ్మ భరోసా కింద ఆర్థిక సాయం అందనుంది.
జిల్లాలో ఈజీఎస్ జాబ్‌కార్డుల వివరాలు(లక్షల్లో)..
జాబ్ కార్డుల సంఖ్య 3.06
కూలీల సంఖ్య 6.43
యాక్టివ్ జాబ్ కార్డులు 1.82
యాక్టివ్ కూలీలు 3.07
Comments
Please login to add a commentAdd a comment